జెఫ్ బిజోస్ బ్యాండ్ బాజా బారాత్.. పెళ్లికి ఏర్పాట్లు మామూలుగా లేవుగా.. అదే రేంజ్ లో నిరసనగళం
ఈ ప్రాంతంలోని దాదాపు ప్రతి లగ్జరీ హోటల్, వాటర్ టాక్సీని జెఫ్ బెజోస్ వివాహ బృందం ఇప్పటికే బుక్ చేసుకున్నట్లు ఇటాలియన్ మీడియా నివేదించింది.

Jeff Bezos Wedding: అసలే ప్రపంచ కుబేరుడు. అంతులేని సంపద కలిగున్నోడు. అలాంటి వ్యక్తి పెళ్లి అంటే మూమూలు విషయమా. పెళ్లి ఏర్పాట్లు ఓ రేంజ్ లో ఉండాల్సిందే. భారీగా డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. అరేంజ్ మెంట్స్ దిమ్మతిరిగిపోయే లెవెల్ ఉండాల్సిందే. ప్రపంచ సంపన్నుడు జెఫ్ బెజోస్ పెళ్లి విషయంలో అదే జరగబోతోంది. కనీవిని ఎరుగని రేంజ్ లో వెడ్డింగ్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. అయితే.. అదే రేంజ్ లో ఈ పెళ్లి ఏర్పాట్లపై నిరసనగళం వినిపిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు. జూన్ చివరి వారంలో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. జూన్ 24 నుంచి 26 వరకు ఇటలీలోని వెనిస్‌లో వీరి వివాహం జరగనుంది. పెళ్లి వేడుకల కోసం వెనిస్‌లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బెజోస్, శాంచెజ్ జంట.. విలాసవంతమైన వివాహానికి సిద్ధమవుతున్నారు. వెనిస్‌లో వివాహ వేడుకలు చాలా రోజుల పాటు జరుగుతాయని భావిస్తున్నారు. ఈ హై-ప్రొఫైల్ వివాహంలో యాచ్ పార్టీలు, గొండోలా రైడ్‌లు, అగ్రశ్రేణి వెనీషియన్ లగ్జరీలు ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. మరోవైపు, ఈ విలాసవంతమైన వివాహంపై స్థానికుల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పవర్ కపుల్ మే 2023లో నిశ్చితార్థం చేసుకున్నారు. వివాహ వేడుకల ప్రదేశంగా వెనిస్‌ను ఎంచుకున్నారు. కచ్చితమైన వేదిక ఇంకా వెల్లడించనప్పటికీ, ఇటలీ తీరంలో బెజోస్‌కు ఉన్న 500 మిలియన్ డాలర్ల విలాస నౌకలో వివాహ వేడుకలు జరగనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
అయితే, కఠినమైన నిబంధనల కారణంగా, వెనిస్‌లో బెజోస్ యాచ్ వంటి 3,493 స్థూల టన్నుల పెద్ద ఓడలు గ్రాండ్ కెనాల్‌లోకి లేదా సెయింట్ మార్క్స్ స్క్వేర్ వంటి చారిత్రాత్మక ప్రాంతాలకు దగ్గరగా ప్రవేశించకుండా నిషేధించబడ్డాయి. సమీపంలోని వెనీషియన్ ద్వీపంలోని పునరుద్ధరించబడిన బహిరంగ థియేటర్‌లో వివాహం జరగవచ్చనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.
ఈ గ్రాండ్ వివాహానికి తోడ్పడటానికి అనేక అగ్రశ్రేణి వెనీషియన్ వ్యాపారులను నియమించారు. నివేదికల ప్రకారం, చేతితో బ్లో చేసిన మురానో గాజుకు ప్రసిద్ధి చెందిన స్థానిక డిజైన్ స్టూడియో అలంకరణ అంశాలను అందిస్తుంది. వెనిస్‌లోని పురాతన పేస్ట్రీ దుకాణం రోజా సాల్వా, సాంప్రదాయ వెనీషియన్ విందును సిద్ధం చేస్తుంది. ఈ విందులో వెనెటో మొక్కజొన్న పిండి, నిమ్మ తొక్క, ఎండుద్రాక్షలతో తయారు చేసిన వెన్నతో కూడిన బస్సోలా బిస్కెట్ , జాలెట్టి కుకీలు ఉన్నాయి. వివాహ అలంకరణను లండన్‌కు చెందిన ఈవెంట్ కంపెనీ లాంజా అండ్ బౌసినాకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ ముఖ్యంగా వెనిస్‌లో హై-ప్రొఫైల్ ఈవెంట్లను నిర్వహించడానికి ప్రసిద్ధి చెందింది.
జూన్ 23 నుంచి 28 మధ్య జరగనున్న ఈ వివాహానికి వందలాది మంది ప్రముఖ అతిథులు హాజరవుతారని భావిస్తున్నారు. సెయింట్ మార్క్స్ స్క్వేర్‌కు ఎదురుగా ఉన్న శాన్ జార్జియో ద్వీపం అంతటా వేడుకలు జరుగుతాయని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని దాదాపు ప్రతి లగ్జరీ హోటల్, వాటర్ టాక్సీని జెఫ్ బెజోస్ వివాహ బృందం ఇప్పటికే బుక్ చేసుకున్నట్లు ఇటాలియన్ మీడియా నివేదించింది.
Also Read: వందే భారత్ స్లీపర్ రైలు.. లోపల సౌకర్యాలు ఎలా ఉన్నాయో చూడండి.. వావ్ అనాల్సిందే..
ఓవైపు బెజోస్ పెళ్లికి భారీగా ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు ఈ వేడుకలతో స్థానికులు సంతోషంగా లేరు. వెనిస్‌లోని స్థానికులు బెజోస్‌కు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించారు. ఇంత పెద్ద ఎత్తున నిర్వహించబోయే ప్రైవేట్ వేడుక మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తుందని, చారిత్రాత్మక నగరంలోని కొన్ని ప్రాంతాలను మూసివేసే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు.
పెళ్లికి భారీ ఏర్పాట్లు చేస్తుండడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రద్దీ కారణంగా పర్యాటకులు ఇబ్బంది పడుతున్న నగరంలో ఈ హైప్రొఫైల్ వెడ్డింగ్ కారణంగా మరింత రద్దీ పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నో స్పేస్ ఫర్ జెబోస్ పేరుతో స్థానికులు నిరసనలు చేపట్టారు. లా మిసెరికార్డియా అనే ఈవెంట్ హాల్‌లో వివాహం జరగవచ్చని, అయితే జెబోస్ అక్కడికి చేరుకోలేరంటూ నిరసనకారులు హెచ్చరించారు. తమ శవాలతో రోడ్లను, పడవలు, లైఫ్ సేవర్స్‌తో కాలువలను దిగ్భందిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ పెళ్లి వేడుక సాధారణ వెనీషియన్లకు ప్రయోజనం చేకూర్చదని, దీని వల్ల తీవ్రమైన అసౌకర్యం కలుగుతుందన్నారు.
61 ఏళ్ల బెజోస్ ప్రపంచంలోనే మూడవ అత్యంత ధనవంతుడు. నికర విలువ 220.9 బిలియన్ డాలర్లు. జెఫ్ బెజోస్ 1993లో మెకెంజీ స్కాట్‌ను వివాహం చేసుకున్నారు. 2019లో విడాకులు తీసుకున్నారు. బెజోస్, మెకెంజీకి నలుగురు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత లారెన్ సాంచెజ్‌ను వివాహం చేసుకోవాలని బెజోస్ నిర్ణయించుకున్నారు. 2023లో బెజోస్, లారెన్ శాంచెజ్ నిశ్చితార్థం అయ్యింది.
లారెస్ వయసు 54 ఏళ్లు. జర్నలిస్ట్ గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె దాతృత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. బెజోస్, లారెన్ 2018 నుంచే డేటింగ్‌లో ఉన్నారు. అయితే భార్య మెకంజీతో విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు లారెన్, బెజోస్ తమ మధ్య బంధాన్ని అధికారికంగా వెల్లడించలేదు. లారెన్‌కు కూడా ఇదివరకే పెళ్లైంది. పాట్రిక్ వైట్‌సెల్ ను వివాహం చేసుకున్నారు. వీరి జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మాజీ ఎన్‌ఎఫ్‌ఎల్ ఆటగాడు టోనీ గోంజలెజ్‌తోనూ ఓ కుమారుడికి జన్మనిచ్చారు లారెన్. ఇప్పుడు బెజోస్ తో వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు.