Indian Student Killed: కెనడాలో దారుణం.. మరో భారతీయ విద్యార్థి దారుణ హత్య..
శివాంక్ మృతి పట్ల టొరంటోలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
Indian Student Killed: కెనడాలో దారుణం జరిగింది. భారతీయ విద్యార్థులకు రక్షణ కరువైంది. మరో భారతీయ విద్యార్థిని దుండగులు కాల్చి చంపారు. టొరంటో స్కార్‌బౌరౌగ్ యూనివర్సిటీ సమీపంలో జరిగిన కాల్పుల్లో భారతీయ విద్యార్థి శివాంక్ అవస్థి (20) చనిపోయాడు.
హైల్యాండ్ క్రీక్ ట్రెయిల్ వద్ద టొరంటో యూనివర్సిటీలో శివాంక్ చదువుకుంటున్నాడు. దుండగులు కాల్పులు జరిపి అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో కాలేజీ క్యాంపస్‌ను తాత్కాలికంగా మూసివేశారు. కాల్పుల ఘటన యూనివర్సిటీ విద్యార్థులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.
కాల్పుల శబ్దం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి తీవ్ర రక్తస్రావంతో శివాంక్ అప్పటికే మరణించాడు. దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. శివాంక్ మృతి పట్ల టొరంటోలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుని కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామంది. కాగా, టొరంటోలో ఈ ఏడాది జరిగిన 41వ హత్య ఇది.
ఇక ఇటీవల కెనడాలో భారతీయ మహిళ హిమాన్షీ ఖురానా (30) హత్యకు గురైన సంగతి తెలిసిందే. టొరంటోలో ఉంటుంది. హిమాన్షీ డిజిటల్ క్రియేటర్. హిమాన్షీ హత్య కేసులో అబ్దుల్ గఫూరీ అనే వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడి కోసం గాలిస్తున్నారు. ఈ దారుణ హత్యకు పాల్పడింది ఆమెతో సన్నిహిత సంబంధం కలిగిన గపూరీ అని డౌట్ పడుతున్నారు. వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చెబుతున్నారు. నిందితుడి ఫోటోలను కూడా విడుదల చేశారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలపాలన్నారు. ఖురానా అదృశ్యమైందని డిసెంబర్ 19న పోలీసులకు ఫిర్యాదు అందింది. గాలింపు చేపట్టిన అధికారులకు మరుసటి రోజు ఉదయం ఒక ఇంట్లో ఆమె మృతదేహం లభ్యమైంది.
ఇది మరువక ముందే మరో భారతీయ విద్యార్థిని దుండగులు కాల్చి చంపడం సంచలనంగా మారింది. ఈ వరుస ఘటనలు కెనడాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. తమ పిల్లల భద్రత పట్ల తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. ఉన్నత చదువుల కోసం, మంచి భవిష్యత్తు కోసం అనేక మంది భారతీయ విద్యార్థులు కెనడా వెళ్తున్నారు. అయితే, దుండగుల దాడుల్లో వారిలా ప్రాణాలు కోల్పోతుండటం తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తోంది.
Also Read: క్రిస్మస్ వేళ ఐసిస్‌పై భీకర దాడులు చేయించిన ట్రంప్.. హతమైన ఉగ్రవాదులకు పండుగ శుభాకాంక్షలు అంటూ..
