సమోసాలు చేసిన ఆస్ట్రేలియా ప్రధాని….కలిసి తిందామన్న మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : May 31, 2020 / 01:49 PM IST
సమోసాలు చేసిన ఆస్ట్రేలియా ప్రధాని….కలిసి తిందామన్న మోడీ

Updated On : May 31, 2020 / 1:49 PM IST

మనదేశంలో సమోసా గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. గరం గరం సమోసాను  నూనెలో వేయించిన పచ్చిమిర్చితో కలిపి తింటే ఆ టేస్టే వేరు. ఈ లాక్ డౌన్ సమయంలో మనదేశంలోని చాలామంది ఇళ్లల్లో తాము కోరిన విధంగా సమోసాలు చేసుకుని తింటున్నారు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రధాని కూడా ఈ జాబితాలోకి చేరారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ భారతీయ స్టైల్ లో సమోసా, మామిడికాయ పచ్చడి చేశారు.

ఈ విషయాన్ని ప్రధాని మోడీతో పంచుకోవడానికి స్కాట్… తాను చేసిన వంటకాల ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మ్యాంగో చట్నతో సండే సమోసా చేశా. ఈ వారం నేను భారత ప్రధాని మోడీతో వీడియోలింక్ ద్వారా మీటింగ్ కాబోతున్నా. ఆయన వెజిటేరియన్. ఈ సమోసాను నేను ఆయనతో పంచుకోవాలనుకుంటున్నా అంటూ ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్ ట్వీట్ చేశారు. ప్లేట్లో నోరూరించే సమోసాలు పట్టుకుని, ఆ ఫొటోలను షేర్ చేశారు. 

ఆస్ట్రేలియా ప్రధాని చేసిన సమోసా ట్వీట్‌కు భారత ప్రధాని స్పందించారు. బాగా నోరూరించేలా సమోసాలు ఉన్నట్టున్నాయంటూ మోడీ ట్వీట్ చేశారు. స్కాట్‌ షేర్‌ చేసిన సమోసాలను చూసి సంతోషపడిన మోడీ.. ఇండియన్‌ ఓషియన్‌తో రెండు దేశాలు కలువగా…భారతీయ సమోసాతో ఐక్యంగా ఉన్నాయని ట్వీట్ చేశారు. కరోనా వైరస్‌ పై విజయం సాధించాక ఇద్దరం కలుసుకొని సమోసాలను తింటూ ఎంజాయ్‌ చేద్దాం, ఆ రోజు త్వరలోనే రావాలని ఆశిస్తున్నాను అని స్కాట్ ట్వీట్ కు మోడీ రిప్లై ఇచ్చారు.

జూన్‌4న ఆస్ట్రేలియా-భారత్ ప్రధానులు వర్చువల్‌ ప్లాట్‌ఫాంపై సమావేశం కావాలని, ఆర్థిక, సామాజికాంశాలపై చర్చించాలని ఇదివరకే నిర్ణయించారు. కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా విదేశీ ప్రయాణం చేసేందుకు ఆంక్షలు ఉన్నందున విదేశీ ప్రభుత్వంతో నరేంద్రమోడీ పాల్గొంటున్న తొలి ద్వైపాక్షిక శిక్షరాగ్ర సమావేశంగా రికార్డులకెక్కనున్నది. ఈ శిఖరాగ్ర సమావేశంలో మిలిటరీ సరుకు రవాణా సౌకర్యాలతోపాటు మరికొన్ని ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నట్లు తెలుస్తోంది.