మరో సంక్షోభంలోకి బంగ్లాదేశ్..! తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారు?
బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన మొదటి నిరసన ప్రదర్శన ఇది.

Muhammad Yunus
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (84) రాజీనామాకు సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే.
బంగ్లాదేశ్‌లో రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కొరవడడంతో తాను సరిగ్గా పని చేయలేకపోతున్నానని మహమ్మద్ యూనస్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేయాలనుకుంటున్నట్లు సమాచారం. యూనస్ రాజీనామా చేయాలనుకుంటున్నారన్న విషయం తెలియగానే తాను ఆయన వద్దకు వెళ్లానని సిటిజన్ పార్టీ చీఫ్ నిహిద్ ఇస్లాం అన్నారు.
తాను సరిగ్గా పనిచేయలేని పరిస్థితులు నెలకొనడంతో రాజీనామా చేయాలనుకుంటున్నానని యూనస్ అన్నారని చెప్పారు. అయితే, దేశ భద్రత, భవిష్యత్తు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆ నిర్ణయంపై ముందుకు వెళ్లకూడదని తాను కోరానని నిహిద్ ఇస్లాం అన్నారు.
రాజకీయ పార్టీల నుంచి పూర్తి మద్దతు లభించకపోతే తాను రాజీనామా చేయాలనుకుంటున్నట్లు తన మంత్రివర్గానికి యూనస్ తెలియజేసినట్లు ఆయన కార్యాలయ వర్గాలు చెప్పాయి. “యూనస్ రాజీనామా చేయాలనుకున్నారు, కానీ, రాజీనామా చేయవద్దని మంత్రివర్గ సభ్యులు ఆయనకు చెప్పారు” అని తెలిపాయి.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మద్దతుదారులు వేలాది మంది ఢాకాలో భారీ నిరసనకు దిగారు. బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన మొదటి నిరసన ప్రదర్శన ఇది. ఈ నిరసన ప్రదర్శన జరిగిన తదుపరి రోజే ముహమ్మద్ యూనస్ రాజీనామా గురించి వార్తలు వస్తున్నాయి.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బంగ్లాదేశ్‌లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. 2026 జూన్ నాటికి ఎన్నికలు జరుగుతాయని యూనస్ చెప్పారు. అయితే, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మద్దతుదారులు మాత్రం ఎన్నికల తేదీ గురించి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలని అంటున్నారు.