Shehbaz Sharif: పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి.. భారత్ పై విషం చిమ్మిన షెహబాజ్ షరీఫ్..

పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో కారు బాంబు పేలి 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

Shehbaz Sharif: పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి.. భారత్ పై విషం చిమ్మిన షెహబాజ్ షరీఫ్..

Updated On : November 11, 2025 / 9:57 PM IST

Shehbaz Sharif: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి రెచ్చిపోయారు. భారత్ పై విషం చిమ్మారు. ఇస్లామాబాద్ లో జరిగిన ఆత్మాహుతి దాడిపై స్పందించిన షరీఫ్.. భారత్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఆత్మాహుతి దాడి వెనుక భారత్ ఉందని ఆరోపించారు. తమ దేశాన్ని అస్థిపపరిచే లక్ష్యంతో ఢిల్లీ కుట్రలు చేస్తోందన్నారు. అప్ఘానిస్థాన్ కేంద్రంగా పని చేసే టీటీపీ(తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్).. భారత్ ఆడించే తోలుబొమ్మ అని అన్నారు. ఇది పిల్లలపై దాడులు చేస్తోందన్నారు. అఫ్ఘానిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న వానాలోని ఒక క్యాడెట్ కాలేజీపై సోమవారం జరిగిన దాడిలోనూ ఢిల్లీ పాత్ర ఉందని షరీఫ్ ఆరోపించారు.

”జంట దాడులకు భారత ప్రాయోజిత ఉగ్రవాద ప్రతినిధులే కారణం. పాకిస్తాన్‌ను అస్థిరపరిచే లక్ష్యంతో ఈ దాడులు చేస్తున్నారు” అని షరీఫ్ రెచ్చిపోయారు. తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) దాడులను కాబూల్‌లోని తాలిబాన్ పాలనతో ముడిపెడుతున్నారు షరీఫ్. టీటీపీ భారత దేశపు కీలుబొమ్మగా అభివర్ణించారు. అంతేకాదు.. TTPకి ఫిట్నా అల్ హిందూస్తాన్ అని పేరు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు.

వాస్తవానికి దక్షిణాసియాలో ఉగ్రవాదానికి నిలయంగా మారింది పాకిస్తాన్. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోంది. చాలా కాలంగా టెర్రరిస్టులను పొరుగు దేశాలపైకి ఎగదోస్తోంది. కానీ, తమ దేశంలో ఉగ్రదాడులు జరిగినప్పుడల్లా భారత్ ను నిందించడం పనిగా పెట్టుకుంది.

పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇవాళ కారు బాంబు పేలి 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. 27 మందికి గాయాలయ్యాయి. ఇస్లామాబాద్‌ జిల్లా జ్యుడీషియల్ కాంప్లెక్స్‌లో ఇవాళ మధ్యాహ్నం ఈ పేలుడు సంభవించింది.

పేలుడు జరిగిన కొన్ని గంటలకే షెహబాజ్ షరీఫ్ భారత్ పై పిచ్చి ప్రేలాపనలు చేశారు. దాడికి సంబంధించి ఆయన దగ్గర ఎటువంటి ఆధారాలు లేకపోయినా భారత్ ను నిందించారు. “భారత్ మద్దతుగల ఉగ్రవాదులు ఇస్లామాబాద్‌లో దాడి చేశారు. అప్ఘాన్ భూభాగం నుండి పని చేస్తున్న అదే నెట్‌వర్క్ వానాలోని అమాయక పిల్లలపై కూడా దాడి చేసింది. భారత మద్దతుతో అప్ఘాన్ గడ్డ నుండి జరుగుతున్న ఈ దాడులను ఎంత ఖండించినా సరిపోదు” అని పాక్ ప్రధాని షరీఫ్ అన్నారు.

Also Read: ఢిల్లీలో పేలుడు మరవకముందే పాక్‌లో కారు బాంబు పేలుడు.. 12 మంది మృతి.. పాక్ స్టేట్‌ ఆఫ్ వార్‌ ప్రకటన.. ఏం జరుగుతోంది?