2016 Russia probe: ఒబామాపై ట్రంప్ నిజంగానే విచారణ జరిపిస్తారా? ఏఐ వీడియోలతోనే సరిపెడతారా?
మాజీ అధ్యక్షుడిపై ప్రస్తుత అధ్యక్షుడు దర్యాప్తు చేయించకూడదని చట్టం చెప్పదు.. కానీ, అలా చేయడం రాజకీయాలను చట్టవ్యవస్థ నుంచి వేరుగా ఉంచాలన్న అమెరికా మార్గదర్శకాలకు విరుద్ధం.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను అరెస్టు చేసినట్లు ఉన్న ఓ ఏఐ వీడియోను పోస్ట్ చేశారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఓవల్ ఆఫీసులో ఎఫ్‌బీఐ అధికారులు ఒబామాను అరెస్టు చేసి తీసుకెళ్లి, జైలులో వేసినట్లు ఆ ఏఐ వీడియోలో ఉంది. అయితే, బరాక్ ఒబామా, అతని పాలనలోని సీనియర్ అధికారులపై డొనాల్డ్ ట్రంప్ చట్టపరమైన చర్యలు తీసుకోడానికి అవకాశం నిజంగానే ఉందా? అన్న విషయాన్ని చూద్దాం..
యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ కొన్ని రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేశారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత ఆయన పాలనను నియంత్రించడానికి బరాక్ ఒబామా సన్నిహిత వర్గాలు అసత్య ప్రచారం చేశాయని ఆరోపించారు. అప్పట్లో ఆ ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని, ఒబామా వర్గాలు అసత్య వాదన తెచ్చాయన్నారు. దీనికి ఆధారాలు ఉన్నాయని, బరాక్ ఒబామా పాలనలో పనిచేసిన వారిని విచారించాలని చెప్పారు.
బరాక్ ఒబామా, ఆయన సన్నిహిత వర్గాలు 2016 నవంబర్ ఎన్నికల తర్వాత ట్రంప్‌ను అపఖ్యాతి పాలుచేయడానికి ఉద్దేశపూర్వకంగా చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడ్డారని గబ్బార్డ్ బహిరంగంగా ఆరోపించారు.
“ఎంత శక్తిమంతులైనా, ఈ కుట్రలో పాల్గొన్న ప్రతి వ్యక్తిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. చట్టపరమైన చర్య తీసుకోవాలి. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకోవాలి. అమెరికా ప్రజల విశ్వాసం, ప్రజాస్వామ్యంపై వారి నమ్మకం, దేశ భవిష్యత్తు దీనిపై ఆధారపడి ఉన్నాయి” అని చెప్పారు.
క్లాప్పర్, జాన్ బ్రెన్నాన్ (మాజీ CIA డైరెక్టర్), జాన్ కెర్రీ (మాజీ అమెరికా విదేశాంగ కార్యదర్శి), సూసన్ రైస్ (మాజీ జాతీయ భద్రతా సలహాదారు), ఆండ్రూ మెక్‌కేబ్ (మాజీ FBI డిప్యూటీ డైరెక్టర్), ఒబామా పేర్లను ఆమె పేర్కొన్నారు.
ట్రంప్ స్పందన
గబ్బార్డ్ చేసిన ఆరోపణలకు ట్రంప్ మద్దతు తెలిపారు. తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫాంలో ట్రంప్.. హారిసన్ ఫీల్డ్స్ (తన పరిపాలనలో ఒక ప్రత్యేక సలహాదారు) ఫాక్స్ న్యూస్ లో కనిపించడాన్ని ప్రశంసించారు. “యువ, ప్రతిభావంతులైన హారిసన్ ఫీల్డ్స్ ఫాక్స్ న్యూస్ లో గొప్ప పని చేశారు. మోసం చేసి స్పష్టంగా బయటపడిన ఒబామా, గూండాలను విచారించడంలో వీరి తీరు బాగుంది” అని అన్నారు.
గాబార్డ్ తెలిపిన వివరాలు, ఆరోపణలపై డెమోక్రటిక్ శాసనసభ్యులు స్పందించారు. అవి అన్నీ తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అన్నారు. జిమ్ హిమ్స్ (కనెక్టికట్ ప్రతినిధి, హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీలో ఉన్నతస్థాయి డెమోక్రాట్) ఈ ఆరోపణలను “నిరాధార ఆరోపణలు” అని చెప్పారు.
ఇల్లినాయిస్, అరిజోనా వంటి రాష్ట్రాలలో రష్యా ఏజెంట్లు ఓటరు నమోదు డేటాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఆ ప్రయత్నంలో రష్యా సఫలమైందని అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని అమెరికా నిఘా, సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ ఇప్పటికే తేల్చింది.
ఒబామాను ట్రంప్ చట్టబద్ధంగా విచారించగలరా?
మాజీ అధ్యక్షుడు ఒబామా లేదా ఆయన ప్రభుత్వంలో ఉన్న అధికారులపై ఫెడరల్ కేసులు వేయాలని ట్రంప్ ఆదేశించగలరా? అన్న విషయం రాజకీయ సంప్రదాయాలపై ఆధారపడి ఉంటుంది. 1974లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్.. వాటర్‌గేట్ కుంభకోణం నేపథ్యంలో రాజీనామా చేసిన తర్వాత, తదుపరి ప్రభుత్వాలు ఇటువంటి వారిపై విచారణలు చేయాలా? వద్దా అనే దానిపై న్యాయ శాఖ (DOJ) తీసుకున్న నిర్ణయాలలో నేరుగా జోక్యం చేసుకోవడాన్ని నివారించాయి. అంటే చట్టం, రాజకీయాలను వేరుగా ఉంచడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ సంప్రదాయమే ఇటువంటి కేసుల్లో మార్గదర్శనం చేస్తోంది.
అమెరికా వ్యవస్థలో అటార్నీ జనరల్, ఎఫ్‌బీఐ డైరెక్టర్ ఇద్దరూ అధ్యక్షుడి నియామకంతో కార్యనిర్వాహక శాఖలో పని చేస్తారు. ట్రంప్ తన తొలి పదవీ కాలంలో 2017లో ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీని తొలగించారు. రెండో టర్మ్‌లో క్రిస్టోఫర్ వ్రే స్థానంలో కాష్ పటేల్‌ను తీసుకొచ్చారు.
న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ట్రంప్ నమ్మకస్తులను ముఖ్యమైన స్థానాల్లో ఉంచితే.. అమెరికా అటార్నీలు, అసిస్టెంట్ అటార్నీ జనరల్ స్థాయుల్లో ఫెడరల్ దర్యాప్తులు, అభియోగాలపై ట్రంప్‌నకు నియంత్రణ ఉండే అవకాశం ఉంది.
విపక్ష నాయకులపై చట్టపరమైన చర్యలకు దీన్ని ఓ అవకాశంగా మార్చుకోవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. మాజీ అధ్యక్షుడిపై ప్రస్తుత అధ్యక్షుడు దర్యాప్తు కోరరాదని చట్టం చెప్పదు.. కానీ, అలా చేయడం రాజకీయాలను చట్టవ్యవస్థ నుంచి వేరుగా ఉంచాలన్న అమెరికా మార్గదర్శకాలకు విరుద్ధం. కాబట్టి ఒబామాపై విచారణ జరిపించే అవకాశాలు అంతగా లేవని చెప్పవచ్చు.