China New Virus : వెన్నులో వణుకు పుట్టించే వార్త.. చైనాలో కొవిడ్ తరహా కొత్త వైరస్?

ఆ వైరస్ చైనాను గడగడలాడించింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి సమస్త మానవాళిని బెంబేలెత్తించింది.

China New Virus : వెన్నులో వణుకు పుట్టించే వార్త.. చైనాలో కొవిడ్ తరహా కొత్త వైరస్?

Updated On : February 21, 2025 / 9:54 PM IST

China New Virus : చైనాలో మరో కొత్త వైరస్ వెలుగుచూసినట్లు తెలుస్తోంది. అది కొవిడ్ మాదిరిగా ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. HKU5-CoV-2 అనే వైరస్ ను శాస్త్రవేత్తలు గబ్బిలాల్లో గుర్తించారు. అచ్చం కరోనాలాగే ఈ వైరస్ కూడా జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుందని భావిస్తున్నారు.

ఈ వైరస్ ను మెర్బెకో వైరస్ తో పాటు ప్రాణాంతక మెర్స్ కోవ్ ఉపరకానికి చెందినదిగా పరిశోధకులు తేల్చారు. దీన్ని తొలుత హాంకాంగ్ లోని జపనీస్ పిపిస్ట్రెల్లే రకం గబ్బిలాల్లో గుర్తించారు. కాగా, కొవిడ్‌-19తో పోలిస్తే ఈ వైరస్ సామర్థ్యం తక్కువేనని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాదు.. వ్యాపించే ప్రమాదం కూడా తక్కువగా ఉందన్నారు.

కొత్త వైరస్‌.. కొవిడ్‌ 19కి కారణమైన SARS-CoV-2ను పోలి ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించారట. ఈ మేరకు హాంకాంగ్‌కు చెందిన సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్ పత్రిక తన కథనంలో పేర్కొంది. గబ్బిలాల్లో కరోనా వైరస్‌లపై విస్తృత పరిశోధనలు చేసి బ్యాట్ వుమెన్ గా గుర్తింపు పొందిన వైరాలజిస్ట్ షీ జెంగ్ లీ ఈ పరిశోధనా బృందానికి సారథ్యం వహించారు.

Also Read : భూమిని ఢీకొట్టనున్న భారీ గ్రహశకలం.. డేంజర్‌లో ముంబై సిటీ.. అదే జరిగితే మహానగరం వినాశనమే..!

గాంగ్ జౌ ల్యాబోరేటరీ, గాంగ్ జౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ యూనివర్సిటీతో పాటు వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి చెందిన సైంటిస్టులు భాగస్వాములుగా ఉన్నారు. సైంటిఫిక్ జర్నల్ సెల్ లో దీనికి సంబంధించిన పరిశోధన నివేదికను ప్రచురించారు.

ఈ వైరస్ మానవ కణాలకు, కృత్రిమంగా పెరిగిన ఊపిరితిత్తులు, పేగు కణజాలాలకు సోకుతుందని ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైంది. మానవులు, గబ్బిలాలు, ఇతర జంతువులలోని ACE2 గ్రాహకాలతో కూడా బైండ్ అవగలదు.

Also Read : ‘ద్వారక’ అన్వేషణ మళ్లీ షురూ.. అరేబియా సముద్ర గర్భంలోకి ఐదుగురు డైవర్లు

కొవిడ్ వైరస్ మొదటి కేసు 2019 డిసెంబర్ లో సెంట్రల్ చైనాలోని వుహాన్‌లో నమోదైంది. ఈ వైరస్ చైనాను గడగడలాడించింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి సమస్త మానవాళిని బెంబేలెత్తించింది. లాక్‌డౌన్లకు దారితీసింది. కంటికి కనిపించని ఈ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. దాదాపు 70 లక్షల మంది మరణాలకు కారణమైంది.