Milla Magee: నన్ను వేశ్యలా చూశారు, నాతో అగౌరవంగా ప్రవర్తించారు- మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లండ్ సంచలన ఆరోపణలు..

అర్ధంతరంగా పోటీల నుంచి తప్పుకున్న మాగీ ఒక ఇంటర్వూలో తీవ్ర ఆరోపణలు గుప్పించారు. హైదరాబాద్‌లో తనను కలత పెట్టే సంఘటనలు ఎదురయ్యాయని వాపోయారు.

Milla Magee: నన్ను వేశ్యలా చూశారు, నాతో అగౌరవంగా ప్రవర్తించారు- మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లండ్ సంచలన ఆరోపణలు..

Updated On : May 25, 2025 / 10:18 AM IST

Milla Magee: తెలంగాణలో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల నుంచి మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ తప్పుకున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో తాను పోటీల నుంచి తప్పుకున్నట్లు చెప్పిన మిస్ ఇంగ్లండ్.. ద సన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మిస్ వరల్డ్ పోటీలపై సంచలన ఆరోపణలు చేశారు. తన ఆకస్మిక నిష్క్రమణ వెనుక ఆమె చెప్పిన కారణాలు చిచ్చు రాజేశాయి.

హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నుండి ప్రస్తుత మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ(24) వైదొలిగింది. వ్యక్తిగత కారణాల వల్ల తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మిల్లా మాగీ చెప్పింది. కానీ ది సన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో షాకింగ్ కారణాలు వెల్లడించింది. సంచలన ఆరోపణలు చేసింది. నిర్వాహకులకు పోటీదారుల పట్ల గౌరవం లేదని తెలిపింది.

”ఓ మంచి ఉద్దేశంతో నేను హైదరాబాద్ వెళ్లా. కానీ అక్కడ నాకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నన్ను ఒక వేశ్యలా చూశారు. కొందరు నాతో అగౌరవంగా ప్రవర్తించారు. వినోదం కోసం మమ్మల్ని వీధుల్లో తిప్పారు నిర్వాహకులు. ఇది చాలా అసౌకర్యంగా అనిపించింది.

పురుష స్పాన్పర్ల ముందు పరేడ్ చేయించడం, విపరీతమైన మేకప్ వేసుకోవాలని సూచించడం, ఉదయం నుంచి రాత్రి వరకు ఈవినింగ్ గౌనులు ధరింపజేయడం లాంటివి నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి” అంటూ మిస్ వరల్డ్ పోటీలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు మిల్లా మాగీ. అర్ధంతరంగా పోటీల నుంచి తప్పుకున్న మాగీ ‘ది సన్’ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పలు ఆరోపణలు గుప్పించారు. హైదరాబాద్‌లో తనను కలత పెట్టే సంఘటనలు ఎదురయ్యాయని వాపోయారు.

అందాల పోటీల్లో పాల్గొనేందుకు ఈ నెల 7న హైదరాబాద్ కు వచ్చిన మాగీ.. 16న తిరిగి స్వదేశానికి వెళ్లారు. ఆమె స్థానంలో మిస్ ఇంగ్లాండ్ రన్నరప్ షార్లెట్ గ్రాంట్ (25)ను ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Also Read: ‘స్పిరిట్’ హీరోయిన్ అధికారికంగా అనౌన్స్.. అందర్నీ పక్కన పెట్టి.. యానిమల్ భామకు గోల్డెన్ ఛాన్స్..

కాగా, అందాల పోటీల నిర్వాహకులపై మాగీ చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. దీంతో మిస్ వరల్డ్ సంస్థ స్పందించింది. మిల్లా మాగీ పోటీల నుంచి వైదొలగడంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని చెప్పింది. మిల్లా మాగీ చేసిన ఆరోపణలను ఖండించారు సంస్థ ఛైర్‌పర్సన్, సీఈవో జూలియా మోర్లే. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. బ్రిటిష్ మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా నిరాధారమైనవన్నారు.

తన తల్లి, ఇతర కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించిన అత్యవసర పరిస్థితి కారణంగా పోటీల నుంచి తప్పుకోవాలని మిల్లా మాగీ మమ్మల్ని అభ్యర్థించారని జూలియా మోర్లే తెలిపారు. మిల్లా పరిస్థితిని మేము అర్థం చేసుకున్నామన్నారు. ఆమె కుటుంబ సభ్యుల క్షేమమే మాకు మొదటి ప్రాధాన్యతని, అందుకే వెంటనే ఆమెను ఇంగ్లాండ్‌కు తిరిగి పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని మోర్లే వివరించారు.