అమెరికాలోకి ప్రవేశించిన కరోనా కొత్త స్ట్రెయిన్‌

అమెరికాలోకి ప్రవేశించిన కరోనా కొత్త స్ట్రెయిన్‌

Updated On : December 30, 2020 / 10:33 AM IST

Corona new strain entering in America‌ : ఇప్పటికే పెద్ద ఎత్తున నమోదవుతున్న కరోనా కేసులతో అల్లాడుతున్న అగ్రరాజ్యం అమెరికాను కొత్త స్ట్రెయిన్‌ కలవర పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టస్తోన్న బ్రిటన్‌ కరోనా న్యూ వేరియంట్‌ సెగ అమెరికాకు తగిలింది. కొలరాడోలోని ఓ యువకుడికి బ్రిటన్‌ స్ట్రెయన్‌ కరోనా సోకినట్లు నిర్ధారణయింది. ఏ మాత్రం ట్రావెల్‌ హిస్టరీ లేని ఆ యువకుడికి అమెరికాలోని బ్రిటన్‌ కమ్యూనిటీల ద్వారా కరోనా సోకినట్లు అధికారులు భావిస్తున్నారు.

అయితే ఎవరి నుంచి అతనికి కొత్త స్ట్రెయిన్‌ కరోనా సోకిందో తెలుసుకునే పనులో పడ్డారు అధికారులు. యువకుడి కాంటాక్ట్స్‌ను అధికారులు ట్రేస్‌ చేసే పనిలో ఉన్నారు. అతడిని కలిసినవారంతా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అతడిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

అమెరికాలో ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తోంది. ఆ దేశంలో కేసుల సంఖ్య రెండు కోట్లకు చేరువలో ఉంది. రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న అమెరికాలో లక్షా 95వేల కొత్త పాజిటివ్ కేసులు వచ్చాయి. ఒక్క రోజులోనే 3వేల 4వందల మందిని వైరస్ బలితీసుకుంది. ఓవైపు క్రిస్మస్‌ మరోవైపు న్యూఇయర్ వేడుకలు… ఈ సమయంలో కొత్త స్ట్రెయిన్‌ బయటకు రావడంతో ఆందోళన నెలకొంది.

ట్రావెల్ హిస్టరీ లేని వ్యక్తికి కొత్త స్ట్రెయిన్‌ వైరస్ సోకడంతో చాలామందికి ఇది వ్యాపించి ఉండొచ్చంటున్నారు. అది అలా పాకిపోయి ఉంటే మాత్రం కేసులను అదుపు చేయడం కష్టమని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.