ఆ షిప్ లోని మరో ఇద్దరు భారతీయులకు కరోనా వైరస్

జపాన్ పోర్టులో నిలిపి ఉంచిన డైమండ్ ప్రిన్సెస్ షిప్ లో మరో ఇద్దరు భారతీయులకు కరోనా వైరస్(కోవిడ్-19) సోకినట్లు తేలింది. సోమవారం(ఫిబ్రవరి-17,2020) నుంచి ప్రారంభమయ్యే ఫైనల్ కరోనా వైరస్ టెస్ట్ లలో నెగిటీవ్ గా తేలిన షిప్ లో ఉన్న అన్ని దేశాలకు చెందిన వారు తమ ఇళ్లకు తిరిగివెళ్లేలా అవసరమైన సాయం అందిస్తామని భారత రాయబార కార్యాలయం ఆదివారం(ఫిబ్రవరి-14,2020)ప్రకటించింది. అయితే ఈ సమయంలో మరో షిప్ లో ఉన్న మరో ఇద్దరు భారతీయులకు వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది.
ఇటీవల షిప్ లో ఉన్న ముగ్గురు భారతీయ సిబ్బందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారికి ట్రీట్మెంట్ కొనసాగుతోందని,ముగ్గురి పరిస్థితి మెరుగవుతున్నట్లు శనివారం టోక్యోలోని భారతీయ ఎంబసీ తెలిపింది. గడిచిన రెండు రోజుల్లో ఇద్దరు భారతీయ వ్యక్తులతో కలిపి 137కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఎంబసీ ప్రకటించింది.
ఫిబ్రవరి-3,2020నుంచి డైమండ్ ప్రిన్సెస్ అనే షిప్ ను కరోనా వైరస్ సోకిన పేషెంట్లు ఉన్నారంటూ యొకొహమా పోర్టులో నిలిపి ఉంచారు. షిప్‌లో మొత్తం 3,711 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ షిప్‌లో మొత్తం 138 మంది భారతీయులు ఉన్నారు. హాంగ్‌కాంగ్‌కు చెందిన ఓ ప్రయాణికుడు మొదట కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలాడు. ఈ షిప్‌లో ఆదివారం(ఫిబ్రవరి-16,2020)నాటికి కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 355.
కరోనా వైరస్ సోకని వాళ్లను కూడా అక్కడే దిగ్బంధించడంతో వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. షిప్ లో ఒక నిర్ణీత ప్రదేశంలో అందరూ సన్నిహితంగా ఉంటారని, కామన్ గా ఉండే డైనింగ్ టేబుల్, స్నానపు గదులు, స్విమ్మింగ్ పూల్ నే వాడతారని, ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ ఫెక్షన్లు ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షిప్ లో వైరస్ చాలా వేగంగా వ్యాపించడానికి కారణం ఇదే అంటున్నారు. డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలో కరోనా వైరస్ రోగుల మధ్య బతకుతామో లేదోనని కొందరు ఆందోళన చెందుతున్నారు. నౌకలో ప్రయాణికులను ఆరు అడుగుల దూరంలో నడవమని కోరుతున్నారు. కరోనా వైరస్ సోకిన రోగులకు ఆహారాన్ని వారి గదులకు పంపుతున్నారు.