దావూద్ గ్యాంగ్ కోసం.. పాక్‌లో మప్టీలో అండర్ కవర్ ఏజెంట్లు

ఇంతకాలంగా దావూద్‌ను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తోంది పాకిస్తాన్. పాక్ ప్రభుత్వం , పాక్ మిలిటరీ , పాకిస్తాన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ అన్నీ దావూద్ ను రక్షిస్తూ వచ్చాయి. ఎందుకంటే దావూద్ అక్కడొక అంతర్జాతీయ నేర సామ్రాజ్యాన్ని నిర్మించాడు. పాకిస్తాన్‌కు సమాంతరంగా ఒక ఆర్ధిక వ్యవస్థ సృష్టించాడు. దాని నుంచి పాకిస్తాన్ లబ్ది పొందుతూ వచ్చింది.
ముంబై పేలుళ్ల తరువాత దావూద్ గ్యాంగ్ పాకిస్తాన్ పారిపోయింది. కరాచీ కేంద్రంగా తన ‘డి’కంపెనీని విస్తరించింది. దావూద్‌తో పాటు అతడి నమ్మకస్తులు ఛోటా షకీల్, జమాల్ మెమొన్ కలిసి మారు పేర్లతో తప్పుడు గుర్తింపు కార్డులతో అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. షోయబ్, భొలూ అనే మరో ఇద్దరు స్థానికులను తమ గ్యాంగ్‌లో చేర్చుకున్నారు.
కరాచీ కేంద్రంగా దావూద్ :
ప్రభుత్వ సంస్థలన్నీ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు రక్షణ కల్పిస్తున్నాయి. కరాచీ కేంద్రంగా దావూద్ గ్యాంగ్ ఒక అంతర్జాతీయ అండర్ వరల్డ్‌ను నిర్మించింది. అక్కడ దావూద్ అనేక చట్టబద్ధ, చట్ట వ్యతిరేక వ్యాపారాలు ప్రారంభించాడు. క్రమంగా దావూద్ కరాచీ డాన్ గా ఎదిగాడు . కరాచీ , ఇస్లామాబాద్ నగరాల్లో అనేక ఆస్తులు కూడబెట్టాడు.
కరాచీ స్టాక్ మార్కెట్ లో ‘డి’ కంపెనీ ఒక పెద్ద బ్రోకర్. అక్కడున్న ఒక సమాంతర ఆర్ధిక సంస్థ ‘హుండీ’లో కూడా దావూద్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దావూద్ ఆర్ధిక కార్యకలాపాలు మరింత విస్తరించాయి. ఒక సందర్భంలో పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంకు చిక్కుల్లో పడితే డాలర్లలో రుణం ఇచ్చి ఆదుకున్నాడు. పాకిస్తాన్‌లో దావూద్ ఆర్ధిక పలుకుబడిని అంచనా వేయవచ్చు. కరాచీలో ‘డి’ కంపెనీ బంగారం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ చేసేది. భారీగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించేది. వాళ్ళ క్రికెట్ బెట్టింగ్‌లోనే
హైదరాబాదీ క్రికెటర్ మొహమ్మద్ అజహరుద్దీన్ ఇరుక్కున్నాడని ఆ రోజుల్లో ఆరోపణలు వచ్చాయి.
మఫ్టీలో టాప్ సాయుధ బలగాలు :
అనేక మంది పాకిస్తానీ రాజకీయ నేతలు, అధికారులు, మిలిటరీ ఉన్నతాధికారులు, పాకిస్తాన్ సమాజంలో పేరున్న పెద్దలు అనేక మంది దావూద్ ఆతిధ్యాన్ని స్వీకరించినవారే. పాకిస్తానీ మాజీ క్రికెటర్ మియాందాద్, దావూద్ ఇబ్రహీం వియ్యంకుళ్ళయ్యారు. మియాందాద్ కుమారుడు జునైద్, దావూద్ కుమార్తె మాహృఖ్ వివాహం కరాచీలో అంగరంగ వైభవంగా జరిగింది.
ఆ పెళ్ళికి పాకిస్తాన్ ప్రభుత్వ సంస్థలన్నీ భారీ రక్షణ కల్పించాయి. దావూద్ గ్యాంగ్ ఎక్కడకు వెళ్లినా మఫ్టీలో ఉన్న టాప్ సాయుధ పాకిస్తానీ భద్రతా ఏజెన్సీ దళాలు వారికి రక్షణ కల్పిస్తాయి. గతంలో దావూద్‌కు రక్షణగా ఉండే అనేక మంది ప్రభుత్వ అండర్ కవర్ ఏజెంట్లు ఆ తరువాత దావూద్ గ్యాంగ్‌లో
చేరిపోయారు. దావూద్ భద్రత కోసం పాకిస్తాన్ ప్రభుత్వం అనేక మంది రిటైర్డ్ అధికారులను, సర్వీసులో ఉన్న అధికారులను నియమించింది.
ఇవన్నీ ఒకెత్తయితే దావూద్ గ్యాంగ్ పాక్ ప్రభుత్వానికి గూఢచారిలా కూడా పనిచేస్తుంది. ఇండియాలో ఎలాంటి సమాచారం కావాలన్నా ముంబైలో ఉన్న దావూద్ ఏజెంట్లు క్షణాల్లో పాకిస్తాన్‌కు చేరవేస్తారు. మరో ముఖ్య కార్యక్రమంలో కూడా దావూద్ మనుషులు పాల్గొనేవారు. పాకిస్తాన్ ఎయిర్ పోర్ట్స్‌లో డ్యూటీ చేసే పాకిస్తానీ ఇంటలిజెన్స్ ఏజెంట్లకు వీళ్ళు సహకరించేవాళ్ళు.
ఇండియాకు చెందిన ‘రా’… అంటే … రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్. ఇండియాకు చెందిన అంతర్జాతీయ ఇంటలిజెన్స్ ఏజెన్సీ దీని ఏజెంట్లను గుర్తించడానికి దావూద్ ముఠా పాక్ ఇంటలిజెన్స్ ఏజెంట్లకు సహకరించేది. చైనా, ఉత్తర కొరియా నుంచి పాకిస్తాన్ క్షిపణి పరిజ్ఞానం సమకూర్చుకోవడానికి దావూద్ ఇబ్రహీం ఆర్ధిక సాయం అందించాడు.
ఇన్నిరకాలుగా పాకిస్తాన్‌ను దావూద్ ఆదుకుంటూ వచ్చాడు. అందుకే పాకిస్తాన్ ప్రభుత్వాలు దావూద్ గ్యాంగ్‌ను భారత చట్టాల నుంచి కాపాడుతూ వచ్చాయి. ఇండియన్ పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి తరువాత భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు 20 మంది ఉగ్రవాదుల జాబితా ఒకటి అందజేసింది . ఆ జాబితాలో దావూద్ ఇబ్రహీం పేరు కూడా ఉంది.
వీరంతా పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్నారని ఇండియా పాకిస్తాన్ కు తెలియజేసింది. 1993 ముంబై పేలుళ్ల కేసు కూడా దావూద్ గ్యాంగ్ పై ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం బుకాయిస్తూ వచ్చింది. దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో లేదంటూ బొంకుతూ వచ్చింది.