ట్రంప్, పుతిన్ భేటీకి తేదీ ఫిక్స్.. వారిద్దరూ ఎప్పుడు, ఏ ప్రాంతంలో భేటీ అవుతున్నారో తెలుసా.. అక్కడే ఎందుకు..? వార్‌కు ఎండ్‌కార్డు పడుతుందా
పుతిన్, ట్రంప్ భేటీలో ఒకవేళ యుక్రెయిన్‌పై యుద్ధానికి ఎండ్ కార్డు పడితే భారత్‌పై ట్రంప్ విధించిన సుంకాలను తగ్గించే అవకాశం ఉందని..

Trump Putin Meeting
Trump Putin Meeting: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య భేటీకి తేదీ ఫిక్స్ అయింది. వీరిద్దరూ వచ్చేవారం అంటే.. ఆగస్టు 15వ తేదీన భేటీ అవుతున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ తన అధికారిక ట్రూత్ సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. అయితే, వీరిద్దరూ భేటీ అయ్యేది వైట్ హౌస్‌లో కాదు.. అలస్కా రాష్ట్రంలో.
అలస్కా అనేది అమెరికాకు చెందిన రాష్ట్రం. రష్యాకు దగ్గరగా ఉంటుంది. ఈ భేటీకి ట్రంప్ అలస్కాను ఎంచుకోవడం వెనుక ఓ కారణం ఉందని తెలుస్తోంది. ఇది ట్రంప్, పుతిన్‌ల మధ్య 2019 తరువాత మొదటిసారి జరుగుతున్న భేటీ. ప్రెసిడెంట్స్‌గా జరిగే భేటీ అని చెప్పొచ్చు. వీళ్లిద్దరూ జనవరి నుంచి ఫోన్లో చాలాసార్లు మాట్లాడుకున్నారు. కానీ, ఇలా డైరెక్ట్‌గా కలవడం ఇదే మొదటిసారి. ఈ భేటీ ద్వారా యుక్రెయిన్ – రష్యా మధ్య వార్‌కు ఎండ్ కార్డ్ పడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిండాల్సిందే.
పుతిన్‌తో భేటీపై ట్రంప్ క్లారిటీ ఇచ్చినప్పటికీ.. రష్యా నుంచి ఇంకా భేటీ తేదీపై ఎలాంటి ప్రకటన రాలేదు. రష్యా 2022లో యుక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగకుండా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా ఇరు దేశాల్లోని ప్రజలు, సైనికులు చాలా మంది మరణించారు. ముఖ్యంగా యుక్రెయిన్ దేశంలో లక్షలాది మంది తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. ఈ యుద్ధం ఆపడానికి ఇప్పటి వరకు మూడు సార్లు చర్చలు జరిగినా ఫలితం లేకుండా పోయింది. యుక్రెయిన్‌పై యుద్ధం ఆపాలని రష్యాను ట్రంప్ పదేపదే హెచ్చరిస్తూ వచ్చాడు. అయితే, త్వరలో జరిగే ట్రంప్, పుతిన్ భేటీలో ఈ యుద్ధం ముగింపుపై ఎలాంటి ప్రకటన వస్తుందో వేచి చూడాల్సిందే.
మరోవైపు.. భారత్ పై సుంకాల పెంపువేళ ట్రంప్, పుతిన్ భేటీ ఆసక్తికరంగా మారింది. రష్యా నుంచి చమురును కొనుగోళ్లు జరుపుతుండటంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయాలంటూ ట్రంప్ భారత ప్రభుత్వానికి పలుసార్లు హెచ్చరించారు. అయితే, ట్రంప్ హెచ్చరికలను భారత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో భారత దేశం దిగుమతులపై 50శాతం సుంకాలను అమెరికా విధించింది. భారత ప్రభుత్వం పెద్ద మొత్తంలో రష్యా నుంచి చమురును కొనుగోళ్లు జరపడం ద్వారా యుక్రెయిన్‌పై యుద్ధాన్ని వారు ప్రోత్సహిస్తున్నారంటూ భారత్ పై ట్రంప్ అక్కస్సు వెళ్లగక్కుతున్నాడు.
ఆగస్టు 15వ తేదీన జరిగే పుతిన్, ట్రంప్ భేటీలో ఒకవేళ యుక్రెయిన్‌పై యుద్ధానికి ఎండ్‌కార్డు పడితే భారత్‌పై ట్రంప్ విధించిన సుంకాలను తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై మీడియా ప్రతినిధులు ట్రంప్‌ను ప్రశ్నించగా.. ‘‘అలా జరిగే అవకాశం ఉందని సూచనప్రాయంగా వెల్లడించారు. అయితే, దీనిపై తాము తర్వాత నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతానికైతే భారత్ 50శాతం సుంకాలు చెల్లించాల్సిందే’’ అంటూ ట్రంప్ స్పష్టం చేశారు.