Trump Zelensky Meeting : ముగింపు దిశగా యుక్రెయిన్, రష్యా వార్..! ఫ్లోరిడా మీటింగ్‌కు ముందే పుతిన్‌తో ట్రంప్ ఫోన్ కాల్..
Trump Zelensky Meeting : దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుక్రెయిన్ సంక్షోభానికి ముగింపు దిశగా కీలక అడుగు పడింది.
Trump Zelensky Meeting
Trump Zelensky Meeting : దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుక్రెయిన్ సంక్షోభానికి ముగింపు దిశగా కీలక అడుగు పడింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో జరిపిన భేటీ ఫలవంతంగా ముగిసింది. ఫ్లోరిడాలోని తన మార్ ఎ లాగో నివాసంలో సుమారు మూడు గంటలపాటు ట్రంప్ జెలెన్ స్కీతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. శాంతి ఒప్పందానికి 90శాతం ఆమోదం లభించిందని ఇరువురు నేతలు ప్రకటించారు. అయితే, కీలకమైన సరిహద్దు అంశంపైనే ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని ఇద్దరి మాటల్లో వెల్లడైంది.
యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫ్లోరిడాలో జరిగిన సమావేశానికి ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో డొనాల్డ్ ట్రంప్ టెలీఫోన్ కాల్ మాట్లాడారు. స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 1గంటకు ట్రంప్ ఫ్లోరిడా ఎస్టేట్‌లో జెలెన్స్కీతో జరగనున్న చర్చలకు ముందు ఈ ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. ఈ విషయంపై ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. నేను రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చాలా మంచి, ఉత్పాదక టెలిఫోన్ కాల్ మాట్లాడానని ట్రంప్ తన సోషల్ ట్రూత్ తో పేర్కొన్నాడు.
ట్రంప్ తో భేటీ తరువాత జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికలో ఇరువైపులా సంబంధించిన అంశాలను పొందుపరిచారని తెలిపారు. ఇందులో 90 శాతం ఆమోదయోగ్యంగానే ఉన్నాయన్నారు. అయితే అంతిమంగా.. శాశ్వత శాంతి సాధనలో భద్రతా హామీలే కీలకమైన మైలురాయిగా అభివర్ణించారు. మిగిలిన అంశాలపై యూరోపియన్ యూనియన్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. జనవరిలో వాషింగ్టన్‌లో మరిన్ని చర్చలు జరుగుతాయని, త్వరలోనే ట్రంప్ పీస్ ప్లాన్‌కు తుది రూపం ఇవ్వనున్నట్లు జెలెన్‌స్కీ చెప్పారు.
ట్రంప్ తో సమావేశంకు ముందు జెలెన్ స్కీ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. రష్యా తన తాజా దాడిలో దాదాపు 500 డ్రోన్లు, 40 క్షిపణులను ఉపయోగించింది. రష్యా మన నగరాలను, ప్రజలను ఎగతాళి చేస్తూనే ఉంది. క్రిస్మస్ కాల్పుల విరమణ ప్రతిపాదనలను కూడా మాస్కో తిరస్కరించింది. మాస్కో క్షిపణి, డ్రోన్ దాడుల తీవ్రతను పెంచుతోంది. దౌత్యం గురించి వారు నిజంగా ఎలా భావిస్తున్నారో ఇది స్పష్టమైన సంకేతం. కాబట్టి.. యుక్రెయిన్ కు తగినంత మద్దతు అవసరం. రష్యాపై తగినంత ఒత్తిడి తీసుకురావాలని అని పేర్కొన్నారు.
