తొలి మహిళా పైలెట్: ఎయిర్ ఫోర్స్‌ ఆఫీసర్ రేప్ చేశారు

  • Published By: vamsi ,Published On : March 7, 2019 / 09:00 AM IST
తొలి మహిళా పైలెట్: ఎయిర్ ఫోర్స్‌ ఆఫీసర్ రేప్ చేశారు

అమెరికా రక్షణ విభాగంలో పనిచేసే మహిళలకు భద్రత లేదంటూ అమెరికా సెనేటర్ మర్తా మెక్‌సల్లీ(52) సంచలన విషయాలను వెల్లడించారు. సైన్యంలో పనిచేసే మహిళలపై లైంగిక దోపిడీ, అత్యాచారాలు, లైంగిక దాడులు ఏటేటా గణనీయంగా పెరుగుతున్నాయంటూ ఆమె తెలిపారు. తాను కూడా అత్యాచారానికి, లైంగిక దాడికి గురయ్యానంటూ ఆమె తెలిపింది. రిపబ్లికన్ పార్టీ తరఫున అరిజోనా నుంచి ఎన్నికైన ఆమె.. గతంలో ఆ దేశ వైమానిక దళంలో పనిచేశారు. యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలెట్‌గా కూడా ఆమెకు గుర్తింపు ఉంది.
సెనెట్ ఆర్మ్డ్ సర్వీసెస్ సబ్ కమిటీ విచారణకు హాజరైన ఆమె.. సైన్యంలో మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి అనడానికి తన ఉదంతమే సాక్ష్యమని చెప్పారు. అమెరికా వైమానిక దళంలో చేరిన కొత్తలో తాను అత్యాచారానికి గురయ్యానని, తన పైఅధికారులు తనపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటూ తెలిపారు. అనేక కారణాల వల్ల తాను ఈ విషయాన్ని బయటికి చెప్పుకోలేదని, లైంగిక దాడి కొనసాగుతున్నప్పటికీ..కొన్నేళ్ల పాటు తాను మౌనంగా భరించినట్లు సబ్ కమిటీ ముందు వివరించింది.
క్రమంగా మిలటరీలో అనేక కుంభకోణాలు చోటు చేసుకున్నాయని, సైన్యాధికారులు బాధ్యతారాహిత్యం తీవ్రమైందని ఆరోపించారు. తాను పడిన మానసిక వేదనను బహిర్గతం చేయడానికి ఇదే సరైన సమయమన్నారు. మిలటరీ దారుణాల గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే నోరు విప్పినట్లు ఆమె తెలిపారు. తనలాగే చాలామంది మహిళా బాధితులు రక్షణ విభాగంలో ఉన్నారని అన్నారు. సీనియారిటీ ఉన్నప్పటికీ.. కీలక బాధ్యతలను అప్పగించకుండా దూరం పెట్టారంటూ ఆరోపించారు. 26ఏళ్ల పాటు ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసిన మర్తా మెక్‌సల్లీ.. యుద్ధ విమానాన్ని నడిపిన తొలి పైలెట్.. ప్రతిష్ఠాత్మక కల్నల్ హోదా కూడా ఆమె అందుకుంది. 2010లో పదవీ విరమణ చేసిన ఆమె.. అనంతరం రిపబ్లికన్ పార్టీలో చేరారు. వరుసగా రెండుసార్లు హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్‌కు ఎన్నికయ్యారు. గత ఏడాది అరిజోనా నుంచి సెనెటర్‌గా ఆమె గెలుపొందింది.
కాగా మెక్‌సల్లీ చేసిన ఆరోపణలపై ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన కెప్టెన్ కారీ ఓల్ప్ మాట్లాడుతూ…   మెక్‌సల్లీకి జరిగిన పరిణామాలు దారుణం అని, అందుకు ఆమెకు క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు. ఇకపై ఎయిర్‌ఫోర్స్‌లో మహిళలకు భద్రత కలిపించే విషయంలో జాగ్రత్తగా ఉంటామని, మెక్‌సల్లీ వెనుక, ఆమెతో పాటు లైంగిక దాడులకు బలైన వ్యక్తుల వెనుక మేము సపోర్ట్‌గా ఉంటామంటూ వెల్లడించారు.