అంతరిక్షంలో దూసుకొచ్చిన ముప్పు.. భారత్ అప్రమత్తం.. ఇక ‘బాడీగార్డ్’ శాటిలైట్లపై భారత్ దృష్టి.. అంతరిక్షంలో ఫైట్..
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.27 వేల కోట్లతో 50 పర్యవేక్షణ ఉపగ్రహాలను అభివృద్ధి చేయాలని భారత్ ప్రణాళిక వేసుకుంటోంది. మొదటి ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది ప్రయోగించనుంది

ISRO
Bodyguard Satellites: భారత ఉపగ్రహాలపై ఏ దేశమైనా దాడులు చేస్తే మనవాటిని రక్షించుకునే సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భారత్ ప్రణాళిక వేసుకుంటోంది. 2024 జూన్/జులైలో ఇస్రో ఉపగ్రహం భూమికి 500–600 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో తిరుగుతున్న సమయంలో ఓ విదేశీ ఉపగ్రహం దగ్గరగా వచ్చింది.
అది కిలోమీటర్ దూరంలో ఇస్రో ఉపగ్రహానికి దగ్గరగా వచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. చైనాదిగా భావిస్తున్న ఆ విదేశీ ఉపగ్రహం.. భూమిపై వస్తువులను మ్యాపింగ్ చేయడం, పర్యవేక్షణ వంటి సైనిక వినియోగాలకు సంబంధించిన పనులు చేస్తుంది. (Bodyguard Satellites)
మన ఉపగ్రహంతో ఆ ఉపగ్రహం ఢీ కొట్టకపోయినా.. అది ఇంత దగ్గరగా రావడాన్ని శక్తి ప్రదర్శనగానే భావించవచ్చని, ఆ దేశం తన సామర్థ్యాన్ని చూపించడానికి పరీక్షగా చేసి ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. దీంతో ఇతర ఉపగ్రహాల నుంచి జాతీయ భద్రతకు ఉన్న ప్రమాదాల గురించి భారత్ అప్రమత్తమైంది.
కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలకు సంబంధించి పొంచి ఉన్న ముప్పులను గుర్తించి, వాటిని ఎదుర్కోవాల్సి ఉంది. ‘బాడీగార్డ్ ఉపగ్రహాలు’ అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీ సర్కారు యోచిస్తోందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.
Also Read: అక్టోబర్ మొదటి వారంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకూ…
రూ.27 వేల కోట్లతో ఉపగ్రహ రక్షణ ప్రాజెక్ట్
ఉపగ్రహ రక్షణ ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.27 వేల కోట్లతో 50 పర్యవేక్షణ ఉపగ్రహాలను అభివృద్ధి చేయాలని భారత్ ప్రణాళిక వేసుకుంటోంది. మొదటి ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది ప్రయోగించనుంది.
భారత్ గత 7 దశాబ్దాల్లో పాకిస్థాన్, చైనాతో అనేక సాయుధ ఘర్షణలను ఎదుర్కొంది. పాకిస్థాన్ వద్ద 8 ఉపగ్రహాలు మాత్రమే ఉన్నాయి. భారత్ వద్ద 100కు పైగా ఉన్నాయి. చైనా వద్ద 930కి పైగా ఉపగ్రహాలు ఉన్నాయి.
భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి. 2020లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతి చెందారు. చైనా సైనికులు కూడా మరణించారు.
భారత ప్రభుత్వం ప్రస్తుతం స్టార్టప్‌లతో కలిసి పనిచేస్తోంది. లేజర్ కాంతిని ఉపయోగించి వస్తువుల దూరం, ఆకారం, కదలికలను గుర్తించే సాంకేతికతతో కూడిన ‘లిడార్’ (Light Detection and Ranging) ఉపగ్రహాలను ప్రవేశపెట్టడమే లక్ష్యం. ఇవి ముప్పులను త్వరగా గుర్తిస్తాయి.
ఇస్రో మాజీ డైరెక్టర్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. “మాకు 24×7 కక్ష్యలో ఉన్న వస్తువులను ట్రాక్ చేసే సామర్థ్యం లేదు. కానీ కొన్ని స్టార్టప్‌లు దీని మీద పని చేస్తున్నాయి” అని అన్నారు.
మేలో భారత్-పాక్ మధ్య జరిగిన ఘర్షణలో ఇస్రో కీలక పాత్ర పోషించింది. 400 మందికిపైగా శాస్త్రవేత్తలు పని చేసి కమ్యూనికేషన్ ఉపగ్రహాల ద్వారా సపోర్టు ఇచ్చారు. భవిష్యత్తులో అంతరిక్షంలోనే యుద్ధం ఉంటుందన్న సూచనలు చాలా కాలం నుంచి కనపడుతున్నాయి.