CHINA Drought : చైనాలో 60 ఏళ్లలో ఎప్పుడూ లేని కరువు .. ఎండిపోతున్న నదులు .. మాడిపోతున్న పంటలు

ఓవైపు కరోనా.. మరోవైపు కరువు.. చైనాను అతలాకుతలం చేసేస్తున్నాయ్. కోవిడ్ మహమ్మారి కోరలు చాస్తుంటే.. కరువు కమ్మేసి కకావికలం అవుతున్న పరిస్థితి. గత ఆరు దశాబ్దాల్లో ఎప్పుడూ చూడని పరిస్థితులు చైనాను కుదిపేస్తున్నాయ్. సగం చైనా కరువుతో అల్లాడుతోంది.

CHINA Drought : చైనాలో 60 ఏళ్లలో ఎప్పుడూ లేని కరువు .. ఎండిపోతున్న నదులు .. మాడిపోతున్న పంటలు

CHINA Drought

Updated On : August 27, 2022 / 12:00 PM IST

CHINA Drought : ఓవైపు కరోనా.. మరోవైపు కరువు.. చైనాను అతలాకుతలం చేసేస్తున్నాయ్. కోవిడ్ మహమ్మారి కోరలు చాస్తుంటే.. కరువు కమ్మేసి కకావికలం అవుతున్న పరిస్థితి. గత ఆరు దశాబ్దాల్లో ఎప్పుడూ చూడని పరిస్థితులు చైనాను కుదిపేస్తున్నాయ్. సగం చైనా కరువుతో అల్లాడుతోంది. ఇంతకీ డ్రాగన్‌కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది.. చైనాలో ప్రస్తుత పరిస్థితి ఏంటీ ?

ప్రపంచాన్ని చైనా వెంటాడుతుంటే.. చైనాను ప్రకృతి వెంటాడుతోంది. ప్రకోపం చూపిస్తోంది. నిన్నటి వరకు కరోనా కోరల్లో చిక్కుకొని అల్లాడిపోయిన డ్రాగన్ కంట్రీని.. ఇప్పుడు కరువు కమ్మేస్తోంది. ఓ వైపు కరోనా.. మరోవైపు కరువు.. చైనాను ఫుట్‌బాల్‌ ఆడేస్తున్నాయ్. దీంతో డ్రాగన్‌ కంట్రీ పరిస్థితి అల్లకల్లోలంగా కనిపిస్తోంది. హీట్‌వేవ్‌ కారణంగా చైనాలో కరువు తీవ్రమైంది. దీంతో జనాలు అల్లాడిపోతున్నారు. నదుల్లో నీటి మట్టం పడిపోతోంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద నది.. చైనాలో 40కోట్ల మందికి పైగా తాగునీరు అందిస్తోన్న యాంగ్జీ నది ఎండిపోతోంది. వరద మట్టం భారీగా తగ్గడంతో.. ఆరు వందల ఏళ్ల నాటి బుద్దుడి ప్రతిమలు బయటపడ్డాయ్.

61 ఏళ్లలోనూ ఎప్పుడూ చూడని స్థాయిలో చైనాలో ఎండలు మండిపోతున్నాయ్. దీంతో కరువు తాండవం చేస్తోంది. చైనాలో మూడో అతిపెద్ద ప్రావిన్స్ అయిన సిచువాన్‌లో కరువు తీవ్రంగా ఉంది. ఆ ఏరియాలో ఉన్న 51 చిన్న నదులు, 24 జలాశయాలు పూర్తిగా ఎండిపోయాయ్. నదుల్లో వరద లేకపోవడంతో.. జల విద్యుత్‌ తగ్గిపోయింది. హైడ్రో పవర్ ప్లాంట్ల ఉత్పత్తి పడిపోయింది. చైనాలో బొగ్గు కొరత కారణంగా ఇప్పటికే విద్యుత్తు కోతలు కొనసాగుతుండగా ఈ కరువుతో కష్టాలు రెట్టింపు అయ్యాయ్. దీంతో లక్షల మంది చీకట్లలోనే కాలం వెళ్లదీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయ్.

యాంగ్జీ నది సిచువాన్‌ ప్రావిన్స్‌లోని 80శాతం విద్యుత్‌ అవసరాలు తీర్చేది. హైడ్రో పవర్‌ జనరేషన్‌కు చాన్స్‌ లేకపోవడంతో… విద్యుత్‌ సంక్షోభం ముంచుకొచ్చింది. చాలా పరిశ్రమలను క్లోజ్‌ చేయాల్సి వచ్చింది. ఫ్యాక్టరీలతో పాటు షాపింగ్‌ మాల్స్‌, ఆఫీసులూ పనిచేయడం లేదు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కృత్రిమ వర్షాల మీద దృష్టి సారించింది చైనా సర్కార్. యాంగ్జీ నది ప్రవహించే పరిసర ప్రాంతాల్లో క్లౌడ్‌ సీడింగ్‌ షురూ చేసింది. ప్రత్యేక విమానాల ద్వారా సిల్వర్‌ అయోడిన్‌ను మేఘాల్లోకి వదులుతున్నారు. కింది నుంచి మేఘాలపై సిల్వర్‌ అయోడైడ్‌ ఫైర్‌ చేస్తున్నారు. సిచువాన్‌తో పాటు హుబే ప్రావిన్స్‌లో కూడా కరువు పరిస్థితులు ఉండటంతో అక్కడ కూడా క్లౌడ్‌ సీడింగ్‌ చేపట్టారు. ఐనా పెద్దగా ఫలితం కనిపించడం లేదు.

చైనాలో వర్షాభావ పరిస్థితులు అక్కడి పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయ్. యాంగ్జీ మహా నది ఎండిపోవడం వ్యవసాయాన్ని దెబ్బతీస్తోంది. సాగునీటి కొరత వల్ల హుబై రాష్ట్రంలో 1.7 కోట్ల ఎకరాలు, సిచువాన్‌లో లక్షా 16వేల ఎకరాల్లో పంట నాశనం అయింది. హుబైలో 2 లక్షల 20వేలు, సిచువాన్‌లో 8లక్షల 19వేల మంది తాగునీరు లేక అల్లాడుతున్నారు. చోంగ్‌ కింగ్‌ రాష్ట్ర గ్రామీణ ప్రాంతాలలో 10లక్షల మందికి తాగునీటి కరువు ఏర్పడింది. ఎక్కడి నుంచి వీలైతే అక్కడి నుంచి తాగునీటిని తెచ్చి ఇళ్లకూ, పశువులకూ సరఫరా చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
చోంగ్‌ కింగ్‌ రాష్ట్రంలో కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయ్. జలాశయాలు ఎండిపోవడంతో భూగర్భ జలాలను తోడి… ఎంతోకొంత పంటలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు రైతులు. ఇప్పటికే కోవిడ్‌తో అల్లాడుతోన్న చైనా.. కరువుతో అష్టకష్టాలు పడుతోంది. మండుతున్న ఎండల నుంచి పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక బీజింగ్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సెప్టెంబరు ఆఖరు వరకు ఇదే పరిస్థితి ఉండే చాన్స్ ఉంది. ఐతే చైనాలో కరువు.. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయ్.