POK Firing: పాకిస్తాన్ సైన్యం కిరాతకం.. పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు.. 8మంది మృతి..

ముజఫరాబాద్‌పై వారి కవాతును అడ్డుకోవడానికి వంతెనలపై వ్యూహాత్మకంగా ఉంచిన పెద్ద షిప్పింగ్ కంటైనర్లను నదిలోకి తోసివేశారు.

POK Firing: పాకిస్తాన్ సైన్యం కిరాతకం.. పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు.. 8మంది మృతి..

Updated On : October 1, 2025 / 6:03 PM IST

POK Firing: పీవోకేలో పాకిస్తాన్ ఆర్మీ రెచ్చిపోయింది. అత్యంత కిరాతకంగా వ్యవహరించింది. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 8మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.

పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిరసనలు జరుగుతున్నాయి. పౌరులు చేపట్టిన నిరసనలు మూడవ రోజుకి చేరాయి. ఈ క్రమంలో పాక్ ఆర్మీ దారుణానికి ఒడిగట్టింది. నిరసనకారులపై ఫైరింగ్ చేసింది. ఈ ఘటనలో పౌరులు మరణించారు. బాగ్ జిల్లాలోని ధిర్‌కోట్‌లో నలుగురు చనిపోయారు. ముజఫరాబాద్‌లో ఇద్దరు, మీర్‌పూర్‌లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మంగళవారం కూడా ఇద్దరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 10కి చేరింది.

కాగా, కొంతమంది పోలీసులను బందీలుగా చేసుకున్నట్లు తెలుస్తోంది. తమ ఉద్యమాన్ని అణిచివేయాలని పాక్ సైన్యం చూస్తున్నా ప్రజలు వెనక్కి తగ్గడం లేదు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.

‘ప్రాథమిక హక్కుల తిరస్కరణ’పై జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ఈ నిరసనలు జరుగుతున్నాయి. పౌరుల భారీ నిరసనలు పీవోకేను కుదిపేస్తున్నాయి. మార్కెట్లు, దుకాణాలు పూర్తిగా మూసివేశారు. రవాణ సేవలు సైతం నిలిచిపోయాయి.

ఈ ఉదయం నిరసనకారులు రాళ్ళు రువ్వారు. అంతేకాదు ముజఫరాబాద్‌ లో నిరసనకారుల కవాతును అడ్డుకోవడానికి వంతెనలపై వ్యూహాత్మకంగా ఉంచిన పెద్ద షిప్పింగ్ కంటైనర్లను నదిలోకి తోసేశారు. ముజఫరాబాద్ మరణాలకు పాక్ రేంజర్లు కాల్పులు జరపడమే కారణమని, మిగతా మరణాలకు సైన్యంతో సహా పాక్ భద్రతా దళాలు పౌరులపై జరిపిన భారీ షెల్లింగ్ కారణమని JAAC ఆరోపించింది.

ప్రభుత్వం ముందు 38 డిమాండ్లు..

నిరసనకారులు ముజఫరాబాద్‌లో ‘లాంగ్ మార్చ్’ కొనసాగిస్తున్నారు. పాక్ ప్రభుత్వం ముందు వారు 38 డిమాండ్లు ఉంచారు. పాకిస్తాన్‌లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థులకు పీఓకే అసెంబ్లీలో రిజర్వ్ చేయబడిన 12 సీట్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది పాలనను బలహీనపరుస్తుందని స్థానికులు వాదిస్తున్నారు.

“70 సంవత్సరాలకు పైగా మా ప్రజలకు నిరాకరించబడిన ప్రాథమిక హక్కుల కోసమే మా ఈ పోరాటం. మా హక్కులు మాకివ్వండి. లేదా ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోండి” అని JAAC నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ అన్నారు. పాక్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ కి నవాజ్ మీర్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకాలం ప్రజలు ఓపికపట్టారని, ఇక వారి ఓపిక నశించిందని, ప్రజాగ్రహం ఎదుర్కోనేందుకు పాలకులు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

పీవోకేలో నిరసనలను కంట్రోల్ చేసేందుకు పాక్ ప్రభుత్వం ఇస్లామాబాద్ నుంచి అదనంగా వెయ్యి ట్రూప్ లను పంపింది. అంతేకాదు ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను బంద్ చేసింది.

కాగా, చైనా తయారు చేసిన బాంబులను పాకిస్తాన్ ప్రజలపై వేసింది. దీంతో ఘర్షణ చెలరేగింది. కైబర్ ఫంక్తువా ప్రావిన్స్ లో చైనా తయారు చేసిన ఫైటర్ జెట్ల ద్వారా ఓ గ్రామంపై బాంబులు వేసింది పాక్. ఈ ఘటనలో 60మంది పౌరులు చనిపోయారు. దీంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. అంతేకాదు కైబర్ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోయాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత జైషే మహమ్మద్ లాంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలు తమ కొత్త స్థావరాలను కైబర్ ప్రాంతంలో పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీన్ని అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Also Read: ఫిలిప్పీన్స్‌ను వణికించిన భారీ భూకంపం.. నేలకూలిన భవనాలు.. భయంకరంగా ఉన్న వీడియోలు