భారీ పేలుడు శబ్దాలు.. మాల్‌లో నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు.. వీడియో వైరల్ ..

అల్ ఉదీద్ వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి తర్వాత ఖతార్ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మజీద్ అల్ అన్సారీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.

భారీ పేలుడు శబ్దాలు.. మాల్‌లో నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు.. వీడియో వైరల్ ..

Updated On : June 24, 2025 / 1:43 PM IST

Doha mall: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య వార్ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ సైతం ప్రతీకార దాడులు చేపట్టింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఖతార్‌లోని అమెరికా వైమానిక స్థావరం ఆల్ ఉదీద్ పై క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఖతార్ రాజధాని దోహాలో కూడా భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో దోహాలోని ఓ మాల్‌లో ఉన్న ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


కాల్పుల విరమణ ఒప్పందం..
గత పన్నెండు రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఇరు దేశాలు మిసైళ్ల వర్షం కురిపించుకున్నాయి. ఇదే సమయంలో అమెరికా మిలిటరీ రంగంలోకిదిగి ఇరాన్‌లోని అణుకేంద్రాలపై దాడులు చేసింది. దీంతో ఖతార్‌లోని అమెరికా వైమానిక స్థావరం ఆల్ ఉదీద్ పై ఇరాన్ క్షిపణులతో ప్రతీకార దాడులు చేపట్టింది. అయితే, తాజాగా.. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.

తొలుత కాల్పుల విరణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని తెలిపారు. కొద్దిసేపటి తరువాత ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. దీంతో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు కాల్పుల విరమణ ఒప్పంతో 12రోజులుగా సాగిన యుద్ధం ముగిసినట్లయింది.


ఇరాన్ క్షిపణి దాడిని ఖతార్ ఖండించింది
అల్ ఉదీద్ వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి తర్వాత ఖతార్ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మజీద్ అల్ అన్సారీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ‘అల్-ఉదీద్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ చేసిన దాడిని ఖతార్ దేశం తీవ్రంగా ఖండిస్తోంది. దీనిని ఖతార్ దేశ సార్వభౌమాధికారం, దాని గగనతలం, అంతర్జాతీయ చట్టం మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్ యొక్క స్పష్టమైన ఉల్లంఘనగా మేము భావిస్తున్నాము.’’ అని పేర్కొన్నారు.