PM Modi Warning: పాక్ దాడి చేస్తే భారత్ ప్రతిదాడి మరింత బలంగా, విధ్వంసకరంగా ఉంటుంది- అమెరికాకు తేల్చి చెప్పిన ప్రధాని మోదీ
పాకిస్తాన్ విషయంలో ఇండియా వైఖరిని అమెరికాకు స్పష్టం చేశారు ప్రధాని మోదీ.

PM Modi Warning: పాకిస్తాన్ తో తీవ్ర ఉద్రిక్తతల వేళ ప్రధాని మోదీ ఫైర్ మీద ఉన్నారు. పాక్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మోదీ. పాకిస్తాన్ ఏదైనా చర్యకు పాల్పడితే.. భారత్ నుంచి ప్రతి చర్య మరింత తీవ్రంగా, బలంగా ఉంటుందని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కు తేల్చి చెప్పారు ప్రధాని మోదీ. భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు ప్రధాని మోదీని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇండియా వైఖరిని ఆయనకు స్పష్టం చేసినట్లు సమాచారం.
భారత్ లోని 26 ప్రాంతాలపై పాకిస్తాన్ దాడులకు దిగింది. వెంటనే భారత్ కూడా తీవ్రంగా, శక్తిమంతంగా ప్రతి స్పందించింది. పాక్ పై దాడులు చేసింది అని ప్రధాని మోదీ వాన్స్ తో చెప్పినట్లు తెలుస్తోంది.
అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్ భారత పర్యటనలో ఉన్న సమయంలోనే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో ముష్కరులు మారణహోమం సృష్టించారు. టూరిస్టులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. 26 మంది ప్రాణాలు తీశారు. పహల్గాం ఉగ్రవాద దాడి ఘటనతో భారత్, పాకిస్తాన్ మధ్య ఒక్కసారిగా తీవ్రమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి అంటూ శనివారం సాయంత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా అదే ప్రకటన చేశారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఆ తర్వాత కాల్పుల విరమణను ధృవీకరించారు.
Also Read: ‘బుల్లెట్ దిగిపోద్ది..’ పాకిస్థాన్ కు ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్..
అంతకు ముందు రోజు, రూబియో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, దార్.. అలాగే జైశంకర్‌తో మాట్లాడి ఉద్రిక్తతను తగ్గించాలని కోరారు. పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కాల్పుల విరమణ కోసం తమను సంప్రదించారని.. దీనికి అంగీకరించామని భారత విదేశాంగ శాఖ విక్రమ్ మిస్రీ తెలిపారు.
మరోవైపు పాక్ ఆక్రమిత్ కాశ్మీర్(పీవోకే) విషయంలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీవోకేపై భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. పీవోకేను భారత్ కు అప్పగించడం తప్ప పాకిస్తాన్ కు మరో మార్గం లేదన్నారు. పీవోకే విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. కశ్మీర్ అంశంలో ఇంతకుమించి మాట్లాడేది ఏమీ లేదని ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చారు.