Imran Khan: భారత్‌ కంటే బెటర్.. కానీ, రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదు – పాకిస్తాన్ ప్రధాని

దేశంలో నిత్యావసరాల ధరల పెరుగుదల సమస్య వల్ల తనకు రాత్రివేళల్లో నిద్రపట్టట్లేదని అన్నారు పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌.

Imran Khan: భారత్‌ కంటే బెటర్.. కానీ, రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదు – పాకిస్తాన్ ప్రధాని

Imran Khan

Updated On : January 24, 2022 / 9:21 AM IST

Imran Khan: దేశంలో నిత్యావసరాల ధరల పెరుగుదల సమస్య వల్ల తనకు రాత్రివేళల్లో నిద్రపట్టట్లేదని అన్నారు పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌. కానీ, ఇది కేవలం పాకిస్తాన్ సమస్య మాత్రమే కాదని ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలు ఈ సమస్యతో సతమతం అవుతున్నట్లుగా అభిప్రాయపడ్డారు ఇమ్రాన్ ఖాన్.

ద్రవ్యోల్బణానికి రెండు దశలు ఉన్నాయని, తాము ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు భారీ కరంట్ అకౌంట్ లోటు ఉందన్నారు. దానివల్ల దిగుమతుల ధరలు విపరీతంగా పెరిగినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుత ద్రవ్యోల్బణం కరోనా వైరస్ మహమ్మారి వంటి అంతర్జాతీయ పరిస్థితుల ఫలితమని అన్నారు.

అయితే, ఇటువంటి పరిస్థితిలోనూ పాకిస్తాన్.. భారత్‌ ఆర్థిక వ్యవ‌స్థ కంటే మెరుగ్గానే ఉందని చెప్పుకొచ్చారు ఇమ్రాన్ ఖాన్. క‌రోనాను భార‌త్ కంటే గొప్పగానే ఎదుర్కొన్నామ‌ని, ఆ స‌మ‌యంలో భార‌త్ వృద్ధి రేటు కిందికి ప‌డిపోతే, పాక్ ఆర్థికవ్యవ‌స్థ మాత్రం ప‌టిష్ఠంగా నిలబడిందని వెల్లడించారు.

మరోవైపు పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్ రాక కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు ఇమ్రాన్‌ఖాన్‌. లండన్ నుంచి నేడో, రేపో పాకిస్తాన్ వస్తారని చెప్తున్నారు కానీ, ఆయన రాకపోవచ్చని పేర్కొన్నారు. ఎందుకంటే నవాజ్‌ షరీఫ్ డబ్బును ప్రేమిస్తారని, పాకిస్తాన్‌కు తిరిగొచ్చి దానిని పోగొట్టుకోవడానికి షరీఫ్ ఇష్టపడరని అన్నారు.