భారత్-చైనా ల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం

భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల సడలింపునకు రెండు దేశాలు సానుకూల దృక్పథంతో ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తున్నాయని చైనా ప్రకటించింది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై జూన్ 6న రెండు దేశాలకు చెందిన సైనిక ఉన్నతాధికారుల మధ్య సుదీర్ఘ భేటీ జరిగింది.
తూర్పు లడఖ్, ప్యాంగాంగ్ సెక్టార్‌లలోని చైనా బలగాలు వెనక్కు మళ్లుతున్నాయని, విరమణ ప్రక్రియ ప్రారంభమైందని మంగళవారం భారత ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలోనే చైనా నుంచి తాజా ప్రకటన వెలువడింది.
దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యుంగ్ మాట్లాడుతూ.. ఇటీవల చైనా, భారత్ సైనిక, దౌత్య అధికారుల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సంప్రదింపులు జరిగాయి. ఇరువర్గాలు సానుకూల ఏకాభిప్రాయానికి వచ్చాయి.
ఉద్రిక్త వాతావరణాన్ని సడలించడానికి రెండు వైపుల నుంచి ఏకాభిప్రాయం కుదిరే దిశగా అడుగులు పడుతున్నాయి అన్నారు. తూర్పు లడఖ్‌లోని ప్యాంగాంగ్ సరస్సు వద్ద మే 5న చైనా బలగాలు మోహరించడం ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది.
దౌలత్ బేగ్ ఓల్డీకి వెళ్లేందుకు భారత్ నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణాన్ని చైనా వ్యతిరేకిస్తున్నందున ఈ ప్రతిష్టంభన ఏర్పడింది. దాన్ని తొలగించేందుకు జూన్ 6న రెండు దేశాలకు చెందిన సైనికాధికారులు భేటీ అయ్యారు. ఆచర్చల ఫలితంగానే చైనా తన సైన్యాన్నివెనక్కి మళ్లిస్తోంది.