ఆపద్బాంధవుడు రాహుల్, అమెరికాలో 70మంది నిరసనకారులను రక్షించిన ఇండో అమెరికన్

అమెరికాలో నల్ల జాతీయులకు అండగా నిలిచిన ఒక ఇండో అమెరికన్.. ఓవర్ నైట్ హీరో అయిపోయాడు. అపరిచితులకు ఆశ్రయమిచ్చి, పోలీసుల నుంచి దాదాపు 70 మందిని రక్షించినందుకు భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త రాహుల్ దూబేను అమెరికన్ మీడియా హీరోగా కొనియాడుతోంది. జార్జ్ ఫ్లాయిడ్ హత్యను నిరసిస్తూ వాషింగ్టన్ డీసీలో ఆందోళన చేపట్టిన నిరసనకారులకు తన ఇంట్లో ఆశ్రయమిచ్చాడు రాహుల్. ఆందోళనకారులపై పోలీసులు పెప్పర్ స్ప్రే, టియర్ గ్యాస్ ప్రయోగించడంతో.. వారి నుంచి పెద్ద ఎత్తున హాహాకారాలు వినిపించాయి. ఇది గమనించిన రాహుల్ ఆందోళనకారులను ఇంట్లోకి రమ్మని తలుపులు తెరిచాడు.
తన ఇంట్లో ఆందోళనకారులకు ఆశ్రయం:
అప్పటికే ఆందోళనల్లో పాల్గొంటున్నవారికి తన ఇంట్లో వాష్ రూమ్ వాడుకునేందుకు, సెల్ ఫోన్స్ చార్జింగ్ పెట్టుకునేందుకు దూబే అనుమతించాడు. ఒక్కసారిగా పోలీసులు ఆందోళనకారులపై విరుచుకుపడటంతో.. వారిని తన ఇంట్లో తలదాచుకోమని చెప్పాడు. నిరసనకారులను ఇంట్లోకి రమ్మని పది నిమిషాల పాటు బిగ్గరగా అరిచాడు. ఆందోళనకారులు రాహుల్ ఇంట్లోకి ప్రవేశించాక.. కిటికీల్లో నుంచి పోలీసులు పెప్పర్ స్ప్రే జల్లాడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.
హీరో అంటూ రాహుల్ పై ప్రశంసలు:
ఇంట్లోకి వచ్చిన అపరిచితులకు ఆహారం ఇవ్వడంతోపాటు రాత్రంతా ఉండేందుకు, తద్వారా వారు పోలీసులకు చిక్కకుండా కాపాడాడు. మొత్తం మీద ఆ రాత్రి దూబే ఇంట్లోనే తలదాచుకున్న ఆందోళనకారులు మరుసటి రోజు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వాషింగ్టన్‌లో 17 ఏళ్లుగా నివాసముంటున్న రాహుల్ దూబే ట్రేడింగ్ కంపెనీని నడుపుతున్నాడు. రాహుల్ దూబే ఆందోళనకారులకు ఆశ్రయం ఇవ్వడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో అతన్ని హీరో అంటూ చాలామంది కొనియాడారు. అయితే తాను ఆందోళనకారుల కోసం ప్రత్యేకంగా చేసిందేమీ లేదని.. కేవలం వాళ్లకు ఆశ్రయమిచ్చేందుకు తన ఇంటి తలుపులను తెరిచానని రాహుల్ చెప్పాడు. ఆందోళనకారులు శాంతియుత పంథాలో పోరాటాన్ని కొనసాగిస్తారని ఆశించాడు.
సైన్యాన్ని దింపాలన్న ట్రంప్, వ్యతిరేకించిన డిఫెన్స్ సెక్రటరీ:
అమెరికా అల్లర్లు.. ట్రంప్ ప్రభుత్వంలో లుకలుకలకు కారణమయ్యాయి. దేశవ్యాప్తంగా జరుగుతోన్న ఆందోళనలు.. అధికార యంత్రాంగంలోనూ విభేదాలు తీసుకొచ్చాయి. జార్జ్ ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను అణచివేసేందుకు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని.. ఏకంగా అమెరికా డిఫెన్స్ సెక్రటరీ మార్క్ ఎస్పర్ విభేదించారు. శాంతియుత నిరసనలపై సైన్యాన్ని ప్రయోగించాల్సిన అవసరం లేదంటూ బహిరంగంగానే ప్రకటించారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో మాత్రమే వాడాల్సిన ఆర్మీని.. శాంతియుత ప్రజా ఉద్యమాల మీద ప్రయోగించడం సబబు కాదంటూ అధ్యక్షుడి నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
నీరో ఫిడేల్ మీటినట్టు ట్రంప్ ప్రవర్తన:
ఓ ఆందోళనలతో అగ్రరాజ్యం అంతా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతుంటే.. రోమ్ నగరం తగలబడినప్పుడు నీరో ఫిడేల్ మీటినట్టు ట్రంప్ ప్రవర్తించాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాత్యహంకార నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతోన్న క్రమంలో ఓ చర్చి దగ్గర ఫోటోలకు ఫోజివ్వడం సర్వత్రా ఆగ్రహానికి కారణమైంది. ఇలా ట్రంప్ నిర్ణయంపై తీవ్రంగా వ్యతిరేకత వస్తోంది. ముందు ప్రతిపక్ష పార్టీ నేతలు, ప్రజా స్వామ్య వాదుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న ట్రంప్.. ఇప్పుడు ఏకంగా ఏరికోరి నియమించుకున్న డిఫెన్స్ సెక్రటరీ మార్క్ ఎస్పర్ నుంచే వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తోంది. మరి ట్రంప్ దూకుడు ఇప్పటికైనా తగ్గించుకుంటారా? లేక ఇలాగే తన దురుసుతనాన్ని కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి.