Israel Palestine Conflict: యుద్ధంలోకి ఇరాన్! వేలు ట్రిగ్గర్ మీదే ఉందంటూ ఇజ్రాయెల్‌కు తీవ్ర బెదిరింపులు
1979 విప్లవం నుంచి పాలస్తీనా వాదానికి మద్దతు ఇవ్వడం ఇస్లామిక్ రిపబ్లిక్ కు ప్రధాన అంశంగా మారింది. ఇక షియా-ఆధిపత్య దేశమైన ఇరాన్.. ముస్లిం ప్రపంచానికి తనను తాను నాయకుడిగా తీర్చిదిద్దుకునేందుకు తరుచూ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

Iran Warns Israel: ఇజ్రాయెల్-హమాస్ మధ్య సాగుతున్న యుద్ధంలోకి ఇరాన్ దేశం భాగస్వామ్యం కానుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌కు ఇరాన్ చేసిన బెదిరింపులే ఇందుకు ప్రధాన కారణం. గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలు తప్పుకుని, దురాక్రమణను ఆపివేయాలని లేని పక్షంలో తమ వేలు ట్రిగ్గర్ మీదే ఉందంటూ తీవ్ర స్థాయిలో హెచ్చిరించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్బొల్లాహియన్ ఈ ప్రకటన చేశారు. గాజా మీద తీవ్ర దాడికి ఇజ్రాయెల్ ప్లాన్ చేసిన నేపథ్యంలో ఇరాన్ నుంచి ఈ ప్రకటన వెలువడింది.
ఇరాన్ కు చెందిన మతాధికారులు హమాస్‌కు ఆయుధాలు సరఫరా చేస్తూ హింసను ప్రేరేపించారని ఇజ్రాయెల్ చాలా కాలంగా ఆరోపిస్తోంది. గాజా స్ట్రిప్‌ను నియంత్రించే సమూహానికి ఇరాన్ నైతిక, ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని వారి వాదన. 1979 విప్లవం నుంచి పాలస్తీనా వాదానికి మద్దతు ఇవ్వడం ఇస్లామిక్ రిపబ్లిక్ కు ప్రధాన అంశంగా మారింది. ఇక షియా-ఆధిపత్య దేశమైన ఇరాన్.. ముస్లిం ప్రపంచానికి తనను తాను నాయకుడిగా తీర్చిదిద్దుకునేందుకు తరుచూ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. యుద్ధం మధ్యలో శనివారం హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియెని ఖతర్ లో అమీర్బొల్లాహియన్ కలుసుకున్నారు. వారికి కావాల్సిన సహాయాన్ని అందిస్తామని చెప్పారు.
ఇది కూడా చదవండి: Israel Hamas War : హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోకి ఎలా ప్రవేశించారో చూశారా.. వీడియోను విడుదల చేసిన ఐడీఎఫ్
హమాస్‌పై ఇజ్రాయెల్ భూతల దాడులు జరిపేందుకు సమాయత్తం అయింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గాజా నగరం నుంచి 10 లక్షల మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస పోయారు. గాజాలో 2.4 మిలియన్ల జనాభా ఉండగా వారిలో సగం మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి పోయారు. ఇజ్రాయెల్ అధికారులు గాజాపై ఏదైనా భూతలదాడి రాజకీయ నిర్ణయంపై ఆధారపడి ఉంది. పాలస్తీనా గ్రూప్ హమాస్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడులను ప్రారంభించినప్పటి నుంచి ఉత్తర గాజా స్ట్రిప్‌లో పది లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
హమాస్ అక్టోబర్ 7న చేసిన దాడిలో 1,400 కంటే ఎక్కువ మంది ఇజ్రాయిలీలు మరణించారు. వీరిలో ఎక్కువ మంది పౌరులు. ఇజ్రాయెల్ ప్రకారం, పిల్లలతో సహా కనీసం 155 మందిని హమాస్ సైనికులు బంధించి గాజాకు తీసుకువెళ్లారు. 1973లో ఈజిప్ట్, సిరియాతో వివాదం తర్వాత ఇజ్రాయెల్‌కు ఇది అత్యంత ఘోరమైన యుద్ధం. ఈ యుద్ధంలో పాలస్తీనా పౌరుల మరణాలు 2014 యుద్ధంలో కంటే తక్కువగానే ఉన్నాయి. 2014 యుద్ధంలో 50 రోజుల్లో 2200 మంది పాలస్తీనియన్లు చనిపోగా, ఈసారి 2670 మంది మరణించారు.
ఇది కూడా చదవండి: Israel Palestine Conflict: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్న అమెరికా