ఇజ్రాయెల్ హమాస్‌ల మధ్య భీకర యుద్ధం.. వరుస దాడుల్లో పౌరులు దుర్మరణం
ఇక ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో వేలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు.

Israel Hamas War (Photo Credit : Google)
Israel Hamas War : ఇజ్రాయెల్ హమాస్ ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ వరుస దాడులు పాలస్తీనా పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా గాజాలోని జెబాలియా ప్రాంతంలోని శరణార్థి శిబిరంపై వైమానిక దాడులతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. ఈ దాడుల్లో 29 మంది పాలస్తీనా ప్రజలు మృతి చెందారు.
ఇక ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో వేలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. గత వారం రోజులుగా జెబాలియా ప్రాంతంలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో 150 మంది మృతి చెందినట్లు తెలిపారు. ఈ దాడుల నేపథ్యంలో నిర్వాసితులు ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు వెళ్లకుండా గాజాలోని హమాస్ అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
సురక్షితం అనుకున్న ప్రాంతాల్లోనే దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ సైన్యం తన పౌర ప్రాంతాలను స్థావరాలుగా ఉపయోగించడాన్ని హమాస్ ఖండించింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 42 వేల మంది పాలస్తీనియన్లు మరణించినట్లుగా గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
గత 24 గంటల్లో గాజా స్ట్రిప్ వెంబడి తమ బలగాలు దాదాపు 40 లక్ష్యాలను ఛేదించాయని, డజన్ల మంది ఉగ్రవాదులను హతమార్చాయని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. అక్టోబర్ 7, 2023న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసింది. ఆ దాడిలో దాదాపు 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 250 మందిని బందీలుగా పట్టుకున్నారు. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో పాలస్తీనియన్ల మరణాల సంఖ్యను గాజాలో ఉన్న ఆరోగ్య అధికారులు వెల్లడించారు. మరణాల సంఖ్య 42,227 కి చేరుకుందని చెప్పారు.
Also Read : సిరియాపై అమెరికా బాంబుల వర్షం.. వారి స్థావరాలే లక్ష్యంగా దాడులు..