Israel and Hamas war: గాజాలో మసీదు, పాఠశాలపై ఇజ్రాయెల్ దాడులు.. 24 మంది పాలస్తీనియన్లు మృతి
పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలై ఏడాది పూర్తవుతున్న సమయంలో ఇజ్రాయెల్ వరుస దాడులకు పాల్పడుతుంది.

Israel attack on Gaza
Israeli: పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలై ఏడాది పూర్తవుతున్న సమయంలో ఇజ్రాయెల్ వరుస దాడులకు పాల్పడుతుంది. ఇజ్రాయెల్ దళాలు రాత్రి సమయంలో మసీదు, ఆశ్రయంగా మారిన పాఠశాలపై వైమానిక దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో 24 మంది పాలస్తీనియన్లు మరణించారు. అదేవిధంగా సెంట్రల్ గాజాలో జరిగిన దాడుల్లో మరో 93 మంది గాయపడ్డారు. గత 48 గంటల్లో గాజా స్ట్రీప్ లోని 27 గృహాలు, 27 వివిధ సంస్థలకు చెందిన కార్యాలయాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించాలని ప్రపంచ వ్యాప్తంగా నిరసనకారులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు.
Also Read : ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్..! ఏ క్షణమైనా ఇరాన్‌పై దాడికి సన్నాహాలు..!
సెంట్రల్ గాజా స్ట్రీప్ లోని డీర్ అల్-బలాహ్‌లోని అల్-అక్సా హాస్పిటల్ సమీపంలో మసీదుపై రాత్రివేళ ఇజ్రాయెల్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ దాడిలో 18 మంది మరణించగా.. అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంది. అదేవిధంగా నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్న పాఠశాలపైనా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడటంతో ఆరుగురు మరణించారు.
వేలాది మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చడంతోపాటు బందీలుగా చేసుకున్న తరువాత ఇజ్రాయెల్ హమాస్ పై దాడులను ప్రారంభించిన విషయం తెలిసిందే. హమాస్ మిలిటెంట్లు గత ఏడాది అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్ పై దాడి చేసి 1200 మందిని హతమార్చడంతో దశాబ్దాల నాటి ఇజ్రాయెల్ – పాలస్తీనా వివాదం మళ్లీ రాజుకుంది. హమాస్ దాదాపు 250 మందిని బందీలుగా పట్టుకుంది. ఆ తరువాత గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడులలో వేలాది మంది మరణించారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. గాజాపై ఇజ్రాయెల్ సైనిక దాడిలో 42వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. దీనికితోడు 23 లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు.