ట్రంప్ ఫిక్స్ అయ్యాడు : వరల్డ్ బ్యాంక్ చీఫ్‌గా ఇవాంకా

వరల్డ్ బ్యాంక్ చీఫ్ పదవి రేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు ఇవాంకా ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్ చీఫ్‌గా ఉన్న జిమ్ యంగ్ కిమ్ 2019, ఫిబ్రవరి 1వ తేదీన పదవి నుంచి వైదొలగనున్నారు. 2017లో రెండోసారి చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన కిమ్ పదవీకాలం 2020 నాటికి ముగియనుంది. అయితే మరో ప్రైవేటు సంస్థలో కీలక బాధ్యతలు చేపడుతుండటంతో చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం(జనవరి 7, 2019) కిమ్ ప్రకటించారు.
వరల్డ్ బ్యాంక్‌లో ప్రధాన వాటాదారులుగా అమెరికా, యూరప్ ఉన్నాయి. అత్యధిక వాటా ఉన్న అమెరికా మద్ధతు లభించినవారికే ఇప్పటివరకు చీఫ్ పదవి దక్కింది. ఈ సమయంలో అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంటుకు పలు నామినేషన్లు వస్తున్నాయి. ఇవాంకా ట్రంప్‌తో పాటు ఐక్యరాజ్యసమితిలో అమెరికా అంబాసిడర్‌గా బాధ్యతలు నిర్వహించి 2018, డిసెంబర్‌లో పదవి నుంచి వైదొలిగిన భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, డేవిడ్ మల్ పాస్ వంటి హేమాహేమీల పేర్లు కూడా ఈ నామినేషన్లలో ఉన్నాయి. ప్రస్తుతం ఇవాంకా ట్రంప్ అమెరికా అధ్యక్షుడికి సలహాదారుగా ఉన్నారు. ఇతర దేశాల నుంచి వరల్డ్ బ్యాంక్ చీఫ్ పదవికి పోటీ ఉన్నప్పటికీ ట్రంప్ ఇవాంకాను ఆ పదవిలో కూర్చోబెట్టాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అయితే చీఫ్ పదవి విషయంలో అమెరికా ఆధిపత్యంపై చైనా ఆక్షేపణ వ్యక్తం చేస్తోంది.