Green Card: అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్.. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వ్యాఖ్యలతో ఆందోళన
అమెరికా గ్రీన్ కార్డుపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

JD Vance
JD Vance Green Card: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్న వారిని తమతమ దేశాలకు పంపిస్తున్నారు. అయితే, అమెరికాలో గ్రీన్ కార్డు కలిగిన ఇతర దేశస్తులు తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్న వేళ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
గ్రీన్ కార్డు కలిగిన వారు అమెరికాలో శాశ్వత నివాస దారులుగా గుర్తించబడతారు. గ్రీన్ కార్డు ద్వారా విదేశీ పౌరులకు అమెరికాలో నివసించేందుకు, పని చేసుకునేందుకు హక్కు కల్పిస్తుంది. అంతేకాక కోరుకున్న కంపెనీలో పనిచేయొచ్చు. సొంత వ్యాపారం వంటివీ చేసుకోవచ్చు. గ్రీన్ కార్డు పొందిన మూడు నుంచి ఐదేళ్లకు పౌరసత్వం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అమెరికాలో నివసిస్తున్న వేలాదిమంది భారతీయులు దశాబ్దాలుగా గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అమెరికా ప్రతీయేటా గరిష్ఠంగా 6.75లక్షల గ్రీన్ కార్డులు మాత్రమే జారీ చేస్తుంది. వాటిలో ఏ దేశానికి ఏడు శాతం మించి ఇవ్వరాదన్న నిబంధన ఉంది. ప్రస్తుతం అమెరికాలో గ్రీన్ కార్డులున్న భారతీయుల సంఖ్య మూడు లక్షలకుపైగానే ఉంటుంది.
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత గోల్డ్ కార్డు స్కీమును ప్రకటించాడు. గ్రీన్ కార్డు ద్వారా లభించే సదుపాయాలన్నీ గోల్డ్ కార్డు ద్వారా లభిస్తాయని ట్రంప్ చెప్పారు. గోల్డ్ కార్డు ద్వారా అదనంగా అమెరికాలో శాశ్వత నివాసానికి, పౌరసత్వానికి కూడా గోల్డ్ కార్డు రాచమార్గం అని ట్రంప్ చెప్పారు. గోల్డ్ కార్డు కోసం 50లక్షల డాలర్లు (రూ.43.54 కోట్లు) ఫీజుగా నిర్ణయించారు. కనీసం కోటి గోల్డ్ కార్డులు అమ్మాలనేది మా లక్ష్యం అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తాజాగా చేసిన వ్యాఖ్యలు.. గ్రీన్ కార్డు కలిగిన విదేశీయుల్లోనూ, గోల్డ్ కార్డు కొనుగోలు చేయాలనుకుంటున్న వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి.
గ్రీన్ కార్డులకు సంబంధించి జేడీ వాన్స్ మాట్లాడుతూ.. గ్రీన్ కార్డులు పొందినోళ్లు అమెరికాలో శాశ్వతంగా ఉండిపోలేరని అన్నారు. గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన అమెరికాలో ఎల్లకాలం ఉండేందుకు హక్కు లేదు. ఇది ఫ్రీ స్పీచ్ కు సంబంధించిన అంశం కాదు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశం. మరీ ముఖ్యంగా మాలో ఎవరిని కలుపుకోవాలో అమెరికా పౌరులుగా మేము నిర్ణయిస్తాం అని వాన్స్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. చట్ట ప్రకారం కొన్ని సందర్భాల్లో గ్రీన్ కార్డులను రద్దుచేయడం జరుగుతుందని చెప్పాడు.
నేరాలకు పాల్పడినా, సుదీర్ఘకాలం దేశంలో ఉండకపోయినా, ఇమిగ్రేషన్ రూల్స్ పాటించకపోయినా గ్రీన్ కార్డులను రద్దు చేసేందుకు అవకాశం ఉందని వాన్స్ అన్నారు. అయితే, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తరువాత ఇమిగ్రేషన్ విధానాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.