India vs Canada: భారత్ ఆగ్రహంతో వెనక్కి తగ్గిన కెనడా.. ఆ కథనాలు అవాస్తవమని వెల్లడి
భారత్ ఆగ్రహంతో దిగొచ్చిన కెనడా ప్రభుత్వం.. నిజ్జర్ హత్య కేసు కుట్రలో ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి పేర్లను ప్రస్తావించలేదని..

Justin Trudea and Modi
Canada PM Justin Trudeau: కెనడా ప్రభుత్వం భారత్ పై చేసేవన్నీ అసత్య ఆరోపణలేనని మరోసారి రుజువైంది. ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ప్లాన్ చేసిన విషయం భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవర్ కు తెలుసంటూ.. కెనడాకు చెందిన ‘గ్లో అండ్ మెయిల్’ వార్తా పత్రిక పేర్కొంది. ఈ విషయాన్ని కెనడా సీనియర్ జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పినట్లు ఆ కథనంలో పేర్కొనడం గమనార్హం. దీంతో భారత్ ప్రభుత్వం కెనడా తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి అర్ధంలేని కథనాలతో రెండు దేశాల మధ్య మరింత ఉధ్రిక్తతలు పెంచొద్దని, కెనడా ప్రభుత్వ వర్గాలను ఉద్దేశిస్తూ వెలువడిన ఇలాంటి వార్తలపై కెనడా ప్రభుత్వం ఖచ్చితంగా జవాబు ఇవ్వాలని భారత్ హెచ్చరించింది.
Also Read: Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధానికి షాకిచ్చిన ఐసీసీ.. తీవ్రంగా స్పందించిన బైడెన్
భారత్ ఆగ్రహంతో దిగొచ్చిన కెనడా ప్రభుత్వం.. నిజ్జర్ హత్య కేసు కుట్రలో ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి పేర్లను ప్రస్తావించలేదని, వార్తాపత్రికలో వచ్చిన కథనాలు అవాస్తమేనని కెనడా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కెనడా ప్రభుత్వం ఈ కేసులో భారతీయ అధికారులను నేరుగా దోషులుగా చూపే ఎలాంటి ఆధారాలు తమ వద్ద లేవని స్పష్టం చేసింది. దీనికి భిన్నంగా ఎలాంటి కథనాలు ప్రచురితమైన అవన్నీ ఊహాజనితం, అవాస్తవమేనని కెనడా సర్కార్ తమ ప్రకటనలో వెల్లడించింది.
గత సంవత్సరం నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వం ఏజెంట్లకు సంబంధం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన తరువాత రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. నిజ్జర్ హత్య జరిగినప్పటి నుంచి కెనడా ప్రభుత్వం భారత్ ప్రభుత్వంపై, మోదీపై తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉంది. అయితే, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలను భారత్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలో తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నట్లు ట్రూడో ప్రకటించారు. కేవలం నిఘా సమాచారం ఆధారంగా భారత్ పై ఆరోపణలు చేశానని, ఆ సమయంలో ఎటువంటి ఆధారాలు తమ వద్ద లేవని జస్టిన్ ట్రూడో అంగీకరించాడు.