డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారో విన్నారా?: కమలా హారిస్
ఆరిజోనాలోని ఫీనిక్స్‌లో జరిగిన ర్యాలీలో కమలా హారిస్ మాట్లాడారు.

Kamala Harris and Donald Trump
ఎన్నికల వేళ మహిళల గురించి మాట్లాడుతూ ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మండిపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ఇటీవల విస్కాన్సిన్‌లో నిర్వహించిన ప్రచారంలో ట్రంప్ మాట్లాడుతూ.. తాను మహిళలను రక్షించాలనుకుంటున్నానని అన్నారు.
“నేను ప్రజలను రక్షించాలనుకుంటున్నాను. మన దేశంలోని మహిళలను రక్షించాలనుకుంటున్నాను. మహిళలు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నేను ఈ పని చేస్తాను” అని ట్రంప్ అన్నారు.
ఆరిజోనాలోని ఫీనిక్స్‌లో జరిగిన ర్యాలీలో కమలా హారిస్ దీనిపైనే స్పందిస్తూ.. “నిన్న డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారో విన్నారా? మహిళలకు ఇష్టం ఉన్నా లేకపోయినా తను అనుకున్నది చేస్తానని అన్నారు. మహిళలకు ఇష్టం ఉన్నా లేకపోయినా చేస్తారట” అని చెప్పారు.
మహిళలకు స్వతంత్రత ఉండాలని, వారి శరీరాల గురించి వారే నిర్ణయాలు తీసుకోవాలని ట్రంప్ అనుకోరని తెలిపారు. మహిళాల స్వేచ్ఛ, వారి విజ్ఞానం వంటి అంశాలను ట్రంప్ నిర్లక్ష్యం చేస్తారని చెప్పారు. కాగా, మరో నాలుగు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 5న ఓటింగ్ ఉంటుంది.