ముక్కులో ఇరుక్కున్న చెయ్యి, రెండేళ్ల తర్వాత బయటపడింది

టైటిల్ చూసి విస్తుపోయారా? చెయ్యి.. అంత చిన్న ముక్కులోకి ఎలా దూరింది అనే సందేహం వచ్చింది కదూ. అలాంటి డౌట్ రావడం సహజమే. మ్యాటర్ ఏంటంటే, ముక్కులో ఇరుక్కున్న చెయ్యి నిజమైన మనిషి చెయ్యి కాదు, ఓ చిన్న బొమ్మ చెయ్యి. రెండేళ్ల తర్వాత ఆ బొమ్మ చెయ్యి ముక్కులో నుంచి బయటకు వచ్చింది.
పిల్లలు ఆడుకునే సమయంలో నోట్లో, ముక్కులో లేదా చెవిలో ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటారు. ఇది కామన్. కొన్నిసార్లు అవి వారి శరీర భాగాల్లో ఇరుక్కుపోతుంటాయి. ఇటువంటి సందర్భాల్లో తల్లిదండ్రులు కంగారు పడిపోతారు. ఇలాంటి ఘటన ఒకటి న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. పొరపాటున ఓ బాలుడి ముక్కులో బొమ్మకు సంబంధించిన చెయ్యి ఇరుక్కుపోయింది. రెండేళ్ల తర్వాత బయటపడింది. న్యూజిలాండ్‌లోని డునెడిన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. 2018లో డునెడిన్‌కు చెందిన ఏడేళ్ల సమీర్ అన్వర్ అనే పిల్లాడు లీగో గేమ్ ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో లీగో బొమ్మకు చెందిన చెయ్యి పొరపాటున అతడి ముక్కులో ఇరుక్కుపోయింది. పిల్లాడు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్లు ముక్కును పరిశీలించినప్పటికి అక్కడ ఏమీ కనిపించలేదు.
ఆ తర్వాత డాక్టర్ ని సంప్రదించినప్పటికి లాభం లేకపోయింది. ముక్కులో ఏమీ లేదని, ఏదైనా ఉంటే అది పొట్టలోకి పోయి మల విసర్జన చేసేటప్పుడు బయటకు వచ్చేస్తుందని డాక్టర్ చెప్పి పంపేశాడు.
ఈ ఘటన తర్వాత సమీర్‌కు ఎటువంటి అనారోగ్య సమస్య తలెత్తలేదు. దీంతో ఈ విషయాన్ని అంతా మరచిపోయారు. అయితే కొన్ని రోజుల క్రితం సమీర్ తల్లి అతడి కోసం కప్ కేక్ తయారు చేసింది. కేక్‌ను ఆస్వాదించటానికి సమీర్ గట్టిగా వాసన చూశాడు. దీంతో అతడి ముక్కులో నొప్పి పుట్టింది. ఇదే విషయాన్ని తల్లికి చెప్పాడతను. ఆమె సలహా మేరకు గట్టిగా చీదడంతో ముక్కు లోపలినుంచి లీగో ముక్క బయటపడింది. దీనిని చూసిన సమీర్‌తో పాటు తల్లిదండ్రులు తెగ ఆశ్చర్యపోయారు. ఈ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.