మూడేళ్ల పాటు మాలిలో సైనిక పాలన

గతవారం మాలిలో సైనికులు తిరుగుబాటు చేయటంతో దేశాధ్యక్షుడు ఇబ్రహీం బొవకా కేటా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తిరుగుబాటు సైనికులు గత మంగళవారం అధ్యక్షుడు కేటా, ప్రధాని బౌబౌ సిజాలను అదుపులోకి తీసుకుని రాజధాని బమాకో దగ్గరున్న ఆర్మీ క్యాంపు దగ్గరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత కొన్ని గంటలకు అధ్యక్ష పదవికి రాజీనామా చేయటంతో పాటు పార్లమెంటును కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
మంగళవారం మధ్యాహ్నం అధ్యక్షుడి నివాసంలోకి చొరబడ్డ సైనికులు ఆయనతోపాటూ, అక్కడే ఉన్న ప్రధానిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సైనికులు అదుపులోకి తీసుకున్న నేతల్లో అధ్యక్షుడు కేటీ కుమారుడు, జాతీయ అసెంబ్లీ స్పీకర్, విదేశాంగ, ఆర్థిక మంత్రులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.
అయితే,ఇప్పుడు అధికారాన్ని చేజిక్కించుకున్న జుంటా.. సైనిక నేతృత్వంలోనే మూడేళ్లపాటు పరిపాలన కొనసాగనున్నట్లు వెల్లడించింది. ఇందుకు బదులుగా అపహరణకు గురైన మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్ కీతాను విడుదల చేయడానికి అంగీకరించినట్లు ప్రతినిధుల బృందం తెలిపింది. మాలిలో మూడేళ్లపాటు సైనిక నేతృత్వంలోని ఒక సంస్థ నాయకత్వం వహిస్తుందని అతనే దేశాధినేతగా కొనసాగుతాడు అని జుంటా స్పష్టం చేసింది.ప్రస్తుతం అధికారాన్ని చేజిక్కించుకున్న నేపథ్యంలో కేటాను విడుదల చేస్తామని అంతేకాకుండా అతను చికిత్స నిమిత్తం విదేశాలకు కూడా వెళ్లవచ్చునని పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
గత కొన్నాళ్లుగా తిరుగుబాటు జండా ఎగరవేస్తున్న.. జుంటా పలువురు రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకుంది.ఇక దేశంలో నిరసనసెగలు వెల్లువెత్తుతున్న వేళ ముందు జాగ్రత్త చర్యగా ప్రధాని బౌబౌ సిస్సేను సురక్షిత ప్రాంతానికి తరలించారు. జుంటా చర్యకు మద్ధతుగా ప్రతిపక్ష నేతలు సంబురాలు జరుపుకున్నారు.
గత ఎనిమిదేళ్ల కాలంలో మాలిలో నాయకత్వంపై తిరుగుబాటు జరగడం ఇది రెండోసారి. ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతున్నా ఏమీ చేయలేని అసమర్థ అధ్యక్షుడు కీత రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వంపై తిరుగుబాటు పెరగడంతో ప్రజల కోసమే జుంటా పనిచేస్తుందని ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో తగిన సమయంలో ఎన్నికలను నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేసింది.