మిస్టరీ స్తంభాలు : స్పెయిన్ లో మరో మోనోలిత్

  • Published By: madhu ,Published On : December 9, 2020 / 09:12 AM IST
మిస్టరీ స్తంభాలు : స్పెయిన్ లో మరో మోనోలిత్

Updated On : December 9, 2020 / 9:45 AM IST

More monoliths : ప్రపంచంలో మోనోలిత్ హడావుడి నడుస్తోంది. ఎక్కడో ఒక చోట ఈ స్తంభాలు ప్రత్యక్ష్యం అవుతూనే ఉన్నాయి. తాజాగా స్పెయిన్ సగోవియన్ చర్చి సమీపంలో మోనోలిత్ దర్శనం ఇచ్చింది. దీంతో ఆ ప్రాంత వాసులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ స్తంభం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు తెచ్చారు అనే ప్రశ్నలు వేసుకుంటున్నారు.



గత నెలలో అమెరికాలోని ఉటా రెడ్ రాక్ ఎడారిలో ఓ లోహపు దిమ్మె ప్రత్యక్షం కావడం, తర్వాత మాయమవ్వడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇలాంటి దిమ్మెలే రుమేనియా, నెదర్లాండ్స్ తదితర ప్రాంతాల్లో దర్శనమిచ్చాయి. ఇవి ఎలా ప్రత్యక్షమవుతున్నాయో అర్థంకాక అధికారులు, ప్రజలు తీవ్ర విస్మయానికి గురవుతున్నారు. మొన్న కొలంబియాలో బంగారంతో చేసిన దిమ్మె కనిపించడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కనిపించిన ఈ దిమ్మెలన్నీ వెండి, ఇతర లోహాలతో తయారైనవి కాగా, కొలంబియాలోని దిమ్మె పసిడి కాంతులీనుతూ సవాల్ విసురుతోంది.



ఈ దిమ్మెలు ఏర్పుడుతున్న ప్రాంతాలు కూడా ఆసక్తికరంగా మారాయి. మానవ సంచారం లేని చోటనే ఈ దిమ్మెలు ప్రత్యక్షమవుతున్నాయి. ఒకవేళ వాటిని మనుషులే పాతిపెడితే.. అక్కడి వరకు వాటిని ఎలా రవాణా చేశారు అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది మాత్రం గ్రహాంతర వాసులే ఈ దిమ్మెలను భూమిపై పాతుతున్నారని అభిప్రాయపడుతున్నారు.