యూనివర్సిటీలో కరోనా కలకలం, 1200 మందికిపైగా విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్, బయటకు చెప్పొద్దని ప్రొఫెసర్లకు హుకుం

అలబామా యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. 1200మందికి పైగా విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. అలాగే 166 మంది ఉద్యోగులు, ఇతర సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ నిర్దారణ అయ్యింది. అయితే, ఈ విషయాన్ని తోటి విద్యార్థులకు చెప్పొద్దని ప్రొఫెసర్లకు ఆదేశాలు అందడం గమనార్హం.
విద్యార్థులకు కోవిడ్ సోకినా ఎవరికీ చెప్పొద్దని ప్రొఫెసర్లకు ఆదేశాలు:
కేవలం 3 రోజుల వ్యవధిలో ఆగస్టు 25 నుంచి ఆగస్టు 27 మధ్యలో 481 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. విద్యార్థులు, స్కూల్ సిబ్బంది, ఉద్యోగులు కోవిడ్ బారిన పడిన వారిలో ఉన్నారు. అయితే ప్రొఫెసర్లకు కీలక సూచనలు అందాయి. విద్యార్థుల్లో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినా, ఆ విషయాన్ని వారి తోటి విద్యార్థులకు చెప్పొదని ప్రొఫెసర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఈ వ్యవహారం వివాదానికి దారి తీసింది. అలబామా యూనివర్సిటీ పరిధిలోకి వచ్చే మూడు స్కూల్స్ లోనూ కరోనా కేసులు నమోదయ్యాయి. టుస్కాలోసా, బర్మింగ్‌హామ్, హంట్స్ విల్లేలోని అలబామా వర్సిటీలో కరోనా కేసులు వెలుగు చూశాయి.
అందరికీ కరోనా టెస్టులు:
కరోనా కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో యాజమాన్యం అలర్ట్ అయ్యింది. విద్యార్థులు, సిబ్బంది, ఉద్యోగులకు కరోనా టెస్టులు చేస్తున్నారు. 29వేల 938 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 310 మందికి పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ అని నిర్ధారణ అయిన వారిని క్యాంపస్ లోకి అనుమతించడం లేదు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా విద్యార్థుల నడుమ వైరస్ వ్యాప్తి చెందుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. క్యాంపస్ కి తిరిగి వచ్చిన విద్యార్థులందరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశాము, అయినా వైరస్ ని కట్టడి చేయలేకపోతున్నామని వాపోయారు.
అమెరికాలో అత్యధిక కేసులు నమోదు:
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. దేశాలన్నీ దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 25కోట్లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 40వేల మంది కరోనాతో చనిపోయారు. అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(61 లక్షల 10వేల 761), మరణాలు(లక్షా 86వేల 291) సంభవించాయి.
అమెరికా రికార్డు బద్దలు కొట్టిన భారత్:
ఇక ఇండియాలో కరోనా మహమ్మారి మరింత వేగంగా విజృంభిస్తోంది. ఒక రోజు కేసుల్లో అమెరికా రికార్డును ఇండియా బద్ధలు కొట్టింది. నిన్న ఒక్కరోజులోనే(ఆగస్టు 29,2020) దేశవ్యాప్తంగా 79 వేలకు పైగా కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 35 లక్షలను దాటింది. గడచిన వారం రోజుల వ్యవధిలో దాదాపు 5 లక్షల కేసులు నమోదు కాగా, రోజుకు సగటున 70వేల 867 కేసులు వచ్చాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అమెరికాలో ఈ మహమ్మారి విజృంభించిన జూలై చివరి వారంతో పోలిస్తే, ఇండియాలో గత వారం నమోదైన కేసులే అధికం కావడం గమనార్హం.
ఇక నిన్న మహారాష్ట్రలో అత్యధికంగా 16వేల 867 కేసులు వచ్చాయి. రాష్ట్రంలో కరోనా సోకిన వారిలో 27 లక్షల మందికిపైగా కోలుకోగా, 945 మంది మరణించారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక కరోనా తగ్గిందని భావించిన దేశ రాజధానిలోనూ ఇప్పుడు కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న 1,954 కొత్త కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం.