Sunita williams: సునీత విలియమ్స్‌ను ఆహా ఓహో అంటున్నాం సరే.. ఆమెకు, మన ఇండియాకు ఉన్న లింక్ ఏంటి?
సునీత విలియమ్స్‌కు భారత్ పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది.

Sunita Williams
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ (58) ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఆమె అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయినప్పటి నుంచి ఆమె క్షేమంగా తిరిగి రావాలని భారతీయులు కోరుకున్నారు. సునీత విలియమ్స్ పూర్వీకులది భారత్ అని చెప్పుకోవడానికి మన దేశ పౌరులు గర్విస్తున్నారు.
ముఖ్యంగా గుజరాత్‌లోని ఝులసన్ గ్రామంలోని ప్రజలు విలియమ్స్‌కు తమ గ్రామంతో సంబంధం ఉందని గర్వంగా చెబుతుంటారు. ఈ గ్రామం ఒకప్పుడు సునీత విలియమ్స్ తండ్రి, తాతలకు నిలయం. సునీత విలియమ్స్ ఈ గ్రామాన్ని 1972, 2007, 2013లో సందర్శించారు.
ఝులసన్‌లోని ప్రజలు సునీత విలియమ్స్ సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేశారు. దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించారు. తండ్రి వైపు నుంచి వచ్చిన భారతీయ వారసత్వం కారణంగా ఆమెకు మన దేశంతో గొప్ప అనుబంధం ఉంది.
Also Read: సునీతలా సైంటిస్ట్ కావాలంటే ఎలా?.. ఇస్రోలో జాబ్స్.. ఇలా అప్లై చేయండి..
అమెరికాకు ఇలా వెళ్లారు..
సునీత విలియమ్స్ తండ్రి పేరు దీపక్ పాండ్యా. ఆయన గుజరాత్‌లో జన్మించి, 1957లో ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడ ఉర్సులిన్ బోనీ అనే మహిళను వివాహం చేసుకున్నారు.
దీపక్ పాండ్యా, ఉర్సులిన్ బోనీకి ముగ్గురు సంతానం. సునీత విలియమ్స్ ఆ ముగ్గురిలో చిన్నవారు. అమెరికాలోని యూక్లిడ్‌లో 1965లో సునీత విలియమ్స్ జన్మించారు. సునీత విలియమ్స్ అన్నయ్య పేరు జే థామస్. అక్క పేరు దీనా అన్నద్. దీపక్ పాండ్యా 2020లో మృతి చెందారు.
కాగా, దీపక్ పాండ్యా తండ్రిది కూడా ఝులసన్ గ్రామమే. ఈ గ్రామంలో దాదాపు 7,000 మంది ఉంటారు. సునీత విలియమ్స్ తాత, బామ్మ పేరు మీద అక్కడ ఓ లైబ్రరీ కూడా ఉంది. ఆమె తండ్రి దీపక్ పాండ్యా పూర్వీకుల ఇల్లు కూడా ఇక్కడ ఉంది. 2007లో సునీత విలియమ్స్ ఈ గ్రామంలోని స్కూలుకి వచ్చినప్పుడు ఆమెను బంధువు కిశోర్ పాండ్యా కలిశారు.
సునీత విలియమ్స్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ని చాలాసార్లు సందర్శించారు. భారతీయ శాస్త్రవేత్తలు, విద్యార్థులతోనూ ఆమె సంభాషించారు. తన అంతరిక్ష యాత్రల సమయంలో సునీతా విలియమ్స్ భగవద్గీత కాపీని, గణేశుడి విగ్రహాన్ని తీసుకెళ్లారు. మన దేశంతో ఆమెకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుబంధాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. 2008లో సునీత విలియమ్స్‌కు భారత్ పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది.