బంగారంలా మెరుస్తున్న అమెజాన్ అడవులు : అందం వెనుక అరాచకం

బంగారంలా మెరుస్తున్న అమెజాన్ అడవులు : అందం వెనుక అరాచకం

Updated On : February 12, 2021 / 3:33 PM IST

Amazon Forest gold peruvian NASA Pics :  అమెజాన్ అడవులు..అందానికి అత్యంత అరుదైన వన్యప్రాణులకు ఆవాసాలు. ఎన్నో జీవజాతులకు దాదాపు పది లక్షల మంది ఆదిమవాసులకు ఆలవాలం. ఆకుపచ్చని తివాచీ పరిచినట్లుండే అమెజాన్ అడవులు ఇప్పుడు బంగారం రంగులో మెరిసిపోతున్నాయి. కాకపోతే ఈ బంగారపు అందాల వెను అత్యం అరాచకమైన పరిస్థితులు నెలకొన్నాయి. అమెజాన్ నదీ పరివాహక ప్రాంతాలను ఐఎస్‌ఎస్‌ నుంచి వ్యోమగాములు ఫోటో తీశారు. దీన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఎర్త్ అబ్జర్వేటరీ విడుదల చేసింది. పచ్చదం వెల్లివిరియాల్సి చోట బంగారం రంగు ఉండటం మంచి పరిణామం కాదు. మరి ఆ పరిణామాలు అమెజాన్ అరణ్యాల్లో ఎందుకు వచ్చింది? దీని వెనుక కారణాలేంటి?


మైనింగ్ ల పేరుతో పర్యావరణానికి జరిగే హాని ఎంతగా జరుగుతుందో తెలిసిందే. దీంట్లో భాగంగా మైనింగ్ ల పేరుతో అడవులను నరికేస్తున్నారు. అలాగే అమెజాన్ అడవులను కూడా అక్రమంగా నరికేస్తున్నారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద అన్ రిజిస్టర్డ్ మైనింగ్ ఇండస్ట్రీ అని నాసా ఈ సందర్భంగా తెలిపింది. అమెజాన్ ఫారెస్టులో గనుల నుంచి బంగారాన్ని వెలికితీయడానికి పాదరసాన్ని వాడుతున్నారు. ఇవన్నీ అమెజాన్ నదుల్ని పర్యావరణాన్ని తీవ్రంగా కలుషితం చేస్తున్నాయి.

ఈక్రమంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం- ISS నుంచి తీసిన ఫోటో ఒకటి ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. బంగారంలా మెరుస్తూ ఉన్న అమెజాన్ నదీ పరివాహక ప్రాంతాలను ఐఎస్‌ఎస్‌ నుంచి వ్యోమగాములు ఫోటో తీశారు. ఆ ఫోటోలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఎర్త్ అబ్జర్వేటరీ విడుదల చేసింది. ఎంతో అందంగా కనిపిస్తోన్న ఈ ఫోటో వెనుక అక్రమంగా తవ్వి వదిలేసిన బంగారు గనులు ఇలా మెరుస్తూ కనిపిస్తున్నాయి.

 

అమెజాన్ అడవులను అక్రమ మైనింగ్ ఎలా నాశనం చేస్తుందో ఈ ఫోటోల్ని చూస్తే అర్థం అవుతోంది. ఈ ఫోటోల గురించి పర్యావరణవేత్తలు మాట్లాడుతూ..నాసా తీసిన ఈ ఫోటోలను చూస్తే పర్యావరణ విధ్యంసం ఎంతగా జరుగుతోందో ఊహించుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూర్పు పెరూలోని మాడ్రే డిడియోస్ రాష్ట్రంలో అమెజాన్ అభయారణ్యాల్లో మైనింగ్ వల్ల ఈ గుంతలు ఏర్పడ్డాయి. సూర్యుడి కిరణాలు పడి అవి రిఫ్లెక్షన్ అయినప్పుడు అవి ఇలా బంగారంలా మెరుస్తున్నాయి. ఫోటోలో ఇనంబారీ నది, దాని చుట్టూ మైనింగ్ వల్ల ఏర్పడ్డ గుంతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

2011లో సదరన్ ఇంటర్ ఓషియానిక్ హైవే ప్రారంభమైన తరువాత నుంచి ఈ ప్రాంతంలో అక్రమ గోల్డ్ మైనింగ్ పెరిగింది. వాణిజ్యాన్ని, పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి బ్రెజిల్, పెరూలను ఈ హైవే ద్వారా అనుసంధానించారు. కానీ ఇది అడవుల నరికివేతకు పరోక్షంగా కారణమైందని నాసా తెలిపింది. ఇటీవల విడుదల చేసిన ఈ ఫొటోను డిసెంబర్ 24న తీశారు.

అమెజాన్ అడవుల్లో మాడ్రే డి డియోస్ ఒక అందమైన ప్రాంతం. ఇది పరిమాణంలో సౌత్ కరోలినా అంత పెద్దగా ఉంటుంది. ఈ ప్రాంతంలో మకావ్స్, కోతులు, జాగ్వర్లు, సీతాకోకచిలుకలు వంటి ఎన్నో ప్రాణులకు ఆలవాలంగా ఉంది. ఇక్కడ ఉండే టాంబోపాటా నేషనల్ రిజర్వ్ వంటి ప్రాంతాల్లో మైనింగ్‌ను నిషేధించారు. కానీ అక్రమ మైనింగ్ వల్ల ఈ రెయిన్ ఫారెస్ట్ అత్యంత దారుణంగా దెబ్బతింటోంది.

జీవ వైవిధ్యం వల్ల ఉండే ఇక్కడ అడవుల్లో చెట్లను భారీ స్థాయిలో నరికేస్తున్నారు. దీంతో మైనింగ్ తరువాత పచ్చదనం అనేది కనిపించకుండాపోవటంతో ఆ ప్రాంతమంతా బీడుబారిపోతోంది. బంగారం ధరపెరగడంతో అక్రమ గోల్డ్ మైనింగ్ కూడా పెరిగింది. పెరూలో వేలాది మంది ప్రజలు ఈ వ్యాపారంపై మక్కువ చూపుతున్నారు.

2018లో పెరూలోని 22,930 ఎకరాల అమెజాన్ అటవీ ప్రాంతాన్ని నిర్మూలించారని పరిశోధకులు తేల్చారు. 1985 నాటి నుంచి ఇదే అత్యధికమని వెల్లడించారు. 2017 నుంచి అడవుల నరికివేత పెరుగుతోంది. ఈ రెండు సంవత్సరాల కాలంలో గోల్డ్ మైనింగ్ కోసం 34,000 అమెరికన్ ఫుట్‌బాల్ మైదానాలకు సమానమైన పెరువియన్ అమెజాన్ అటవీ ప్రాంతాన్ని నాశనం చేశారని పరిశోధకులు తెలిపారు.

దీనిపై వివిధ దేశాలు దృష్టి పెట్టాలని..అక్రమ మైనింగ్‌ను నిలిపివేయడానికి కఠినమైన నియమ నిబంధనలు రూపొందించాలని సూచిస్తున్నారు. బంగారంలా మెరుస్తున్న అమెజాన్ ఫొటోను చూసి గర్వపడటం కాదు యావత్ సమాజం సిగ్గుపడాలని.. మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిని ఎంతగా విధ్వంసాలు సృష్టించి నాశనం చేస్తున్నాడో ఈ ఫోటోలను చూస్తే అర్ధమవుతోందని పర్యావరణవేత్తలు..పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ భూమండలానికి ఊపరితిత్తుల్లా ఉన్న అమెజాన్‌ అడవులను సర్వ నాశనం చేస్తున్నారని తీవ్రంగా మండిపడుతున్నారు.