భారత్ నుంచి వచ్చి కరోనా వ్యాప్తి చేస్తున్నారు…నేపాల్ ప్రధాని

  • Published By: venkaiahnaidu ,Published On : May 26, 2020 / 09:33 AM IST
భారత్ నుంచి వచ్చి కరోనా వ్యాప్తి చేస్తున్నారు…నేపాల్ ప్రధాని

Updated On : May 26, 2020 / 9:33 AM IST

భారత్ పై మరోసారి తీవ్ర పదజాలంతో ఘాటైన విమర్శలు చేశారు నేపాల్ ప్రధాని కేపీ ఓలి. భారత్ నుంచి పౌరులు సరిహద్దుల తమ దేశంలో ప్రవేశించి ప్రాణాంతక కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయ సరిహద్దులు దాటినవాళ్లకు టెస్టింగ్ తప్పనిసరి చేసిన WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ)నిబంధనలు ఉల్లంఘించబడ్డాయని నేపాల్ ప్రధాని ఆరోపించారు. ఇతర దేశాల వల్లే నేపాల్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ పరోక్షంగా భారత్‌పై విమర్శలు గుప్పించారు. 

సోమవారం జాతిని ఉద్దేశించి మాట్లాడిన నేపాల్ ప్రధాని ఓలి…డబ్యూహెచ్ వో గైడ్ లైన్స్ ను ఉల్లంఘిస్తూ భారత్ నుంచి పెద్ద సంఖ్యలో నేపాలీలు దేశంలోకి వచ్చారు. వీరిలో చాలామంది భారత్ లో నివసిస్తున్న వలసకూలీలే. నేపాల్ లోకి వచ్చి కరోనా వైరస్ ను వ్యాప్తి చేస్తున్నారు. నిపుణుల సూచన ప్రకారం…నేపాల్ లో దేశ జనాభాలోని రెండు శాతం ప్రజలకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కరోనా లక్షణాలతో బాధ పడుతున్న వారికి క్వారంటైన్‌ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించారు. దక్షిణాసియాలో అన్ని దేశాల కంటే నేపాల్‌లోనే కరోనా మరణాల సంఖ్య అతి తక్కువగా ఉందన్నారు. 

అదే విధంగా… కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అనుసరించాల్సిన వ్యూహాలపై తాను పలు దేశాల,ప్రభుత్వాల అధినేతలతో మాట్లాడినట్లు ఓలి తెలిపారు. తమ దేశాల్లోని నేపాలీల రక్షణను చూసుకుంటామని వాళ్లు తనకు హామీ ఇచ్చారన్నారు. వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన నేపాలీలను సురక్షిత పద్ధతిలో స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. 

కాగా కైలాష్ మానసరోవర్ యాత్రకు భారతీయులు సులభంగా చేరుకునేందు ఉత్తరాఖండ్ నుంచి నిర్మించిన రోడ్డు మార్గం ఇప్పుడు భారత్‌- నేపాల్‌ల మధ్య వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  చైనా, ఇటలీ కంటే భారత్‌ నుంచి వ్యాపించే వైరస్‌ మరింత ప్రమాదకరమైనదని అంటూ గత వారం నేపాల్ ప్రధాని ఆ దేశ పార్లమెంట్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్‌ నుంచి వచ్చే వాళ్ల వల్లే తమ దేశంలో మహమ్మారి ప్రబలుతోందని ఆరోపించారు. అయితే నేపాల్ ను భారత్ పైకి చైనానే ఎగదోస్తుందనే విషయం తెలిసిందే. ప్రధాని కేపీ ఓలి తన పదవిని కాపాడుకునేందుకు చైనాతో చెలిమి చేసి భారత్ పై కయ్యానికి కాలు దువ్వుతూ అర్థరహితమైన విమర్శలు చేస్తున్నారు.

Read: కొవిడ్-19 తగ్గిన ఆ ప్రాంతాల్లో రెండోసారి రాబోతోంది : WHO హెచ్చరిక