నిమిష ప్రియ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. ఆమెకు ఉరిశిక్ష తప్పదా..!

భారతీయ నర్సు నిమిష ప్రియకు విధించిన మరణశిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.

నిమిష ప్రియ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. ఆమెకు ఉరిశిక్ష తప్పదా..!

Nimisha Priya Case

Updated On : July 17, 2025 / 10:44 AM IST

Nimisha Priya Case: భారతీయ నర్సు నిమిష ప్రియకు విధించిన మరణశిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఓ హత్యకేసుకు సంబంధించి జులై 16వ తేదీన ఆమెకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. కానీ, భారత విదేశాంగ శాఖ ప్రయత్నాలు.. క్షమాధనం కోసం మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియూర్ సంప్రదింపులు కొనసాగుతుండటంతో.. నిమిష ప్రియ ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు యెమెన్ ప్రభుత్వం తెలిపింది. క్షమాధనానికి మృతుడు కుటుంబం ఒప్పుకుంటే ఆమె ఉరిశిక్ష తప్పినట్లేనని అందరూ భావించారు. కానీ, మృతుడు కుటుంబం తాజా నిర్ణయంతో నిమిష ప్రియకు ఉరిశిక్ష తప్పేలా కనిపించడం లేదు.

Also Read: కేరళ నర్సు నిమిష ప్రియకు భారీ ఊరట.. ఉరిశిక్షను వాయిదా వేసిన యెమెన్ ప్రభుత్వం

అదొక్కటే మార్గం..
2018లో ట్రయల్ కోర్టు నిమిష ప్రియకు మరణ శిక్ష విధించింది. 2024లో యెమెన్ సుప్రీంకోర్టు శిక్షను సమర్ధించింది. మృతుడు తలాల్ కుటుంబం క్షమాధనంకు ఒప్పుకుంటే మాత్రమే నిమిష ప్రియ ఉరిశిక్ష నుంచి బయటపడుతుంది. గతేడాది నిమిష ప్రియ తల్లి యెమెన్‌కు వెళ్లింది. కుమార్తెను విడిపించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో బాధిత కుటుంబానికి ఒక మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.8.6కోట్ల) క్షమాధనాన్ని ఇచ్చేందుకు నిమిష ప్రియ కుటుంబం సిద్ధమైంది. ఇందుకోసం అన్నివైపుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. కానీ, బాధిత కుటుంబం అందుకు ఒప్పుకోవటం లేదు.

శిక్ష పడాల్సిందే..
నిమిష ప్రియకు క్షమాధనాన్ని ఇచ్చేందుకు మృతుడి కుటుంబం సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆ మేరకు ఎలాంటి చర్చలు లేవని తెలుస్తోంది. మృతుడు తలాల్ ఆదిబ్ మెహది కుటుంబం నిమిష ప్రియకు శిక్ష పడాల్సిందేనని పట్టుబడుతోంది. యెమెన్ కోర్టు ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేసిన తరువాత మృతుడు సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహది ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. ‘ఆమెకు శిక్ష పడాల్సిందే. బ్లడ్‌మనీకి అంగీకరించబోమని స్పష్టం చేశాడు. నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదాను మేము ఊహించలేదు. మధ్యవర్తిత్వం, సయోధ్య కోసం ప్రస్తుతం జరుగుతోన్న ప్రయత్నాలు కొత్తవేమీ కావు. డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేం. మాకు న్యాయం దక్కాల్సిందే అని అర్ధం వచ్చేలా పోస్టులో రాసుకొచ్చారు. దోషిని బాధితురాలిగా చిత్రీకరించే ప్రయత్నం చేయొద్దని హితవుపలికారు.

తాజా పరిణామాలను బట్టిచూస్తే.. నిమిష ప్రియ ఉరిశిక్ష నుంచి బయటపడేందుకు క్షమాధనంకు మృతుడి కుటుంబం ఒప్పుకోకుంటే.. ఆమెకు యెమెన్ ప్రభుత్వం ఉరిశిక్షను అమలు చేసే అవకాశం ఉంది. అయితే, మృతుడి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు ఇంకా కొనసాగుతున్నాయని.. క్షమాధనంకు వారిని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నిమిష లాయర్ పేర్కొన్నారు.