అమెరికా అధ్యక్షుడికి పదవీ గండం!

అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పదవీగండం పొంచి ఉంది. ఆయన అభిశంసన ప్రక్రియ ఫైనల్ దశకు చేరుకుంది. ట్రంప్ తన విస్తృత అధికారాలను దుర్వినియోగం చేశారని, జాతీయ భద్రతను బలహీనం చేశారని, ఎన్నికల వ్యవస్థకు హాని కలుగజేశారని ఆరోపిస్తూ అమెరికా ప్రతినిధుల సభలో ప్రతిపక్ష డెమోక్రాటిక్ పార్టీ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసి గురువారం(డిసెంబర్-5,2019) సభాధ్యక్షుడికి సిఫార్సు చేశారు. అమెరికా అధ్యక్షుడు మాకు మరో మార్గంలేకుండా చేశారని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ట్రంప్ మరోసారి అక్రమంగా ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని నాన్సీఅన్నారు. ప్రతినిధుల సభలో డెమోక్రాటిక్ పార్టీకి మెజార్టీ ఉన్న నేపథ్యంలో తీర్మానం ఆమోదం పొందడం లాంఛనమేనన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి ఇదే జరిగితే అమెరికా చరిత్రలో అభిశంసనను ఎదుర్కొన్న మూడో అధ్యక్షుడిగా ట్రంప్ నిలువనున్నారు. డెమోక్రాట్ల నిర్ణయాన్ని ట్రంప్ ఖండించారు. ఇదో దుస్సంప్రదాయం. ఇకపై అమెరికా అధ్యక్షుడిని బెదిరించేందుకు అభిశంసనను ఓ ఆయుధంగా వాడుకుంటారు. ఈ పరీక్షలో తాము నెగ్గుతామని ఆయన తెలిపారు.
వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా జోసెఫ్ బైడెన్ పోటీలో నిలవనున్నారు. ఈ సమయంలో జోసెఫ్ బైడెన్‌ను దెబ్బతీసేందుకు ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు వొలోడిమర్ జెలెన్‌స్కీని ఓ ఫోన్ కాల్ ద్వారా ట్రంప్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉక్రెయిన్‌లో ఉన్న ఓ సంస్థలో బైడెన్ కుమారుడు హంటర్ బైడన్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాటిపై విచారణ చేపట్టాలని ఉక్రెయిన్ దేశాధ్యక్షుడిని ట్రంప్ బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ఉక్రెయిన్‌కు ఇచ్చేందుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన 250 మిలియన్ డాలర్ల సైనిక సాయం గురించి కూడా ట్రంప్ బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. ట్రంప్ ప్రభుత్వం ఆ నిధులను సెప్టంబర్ వరకూ విడుదల కాకుండా ఆలస్యం చేసింది. ఈ ఫోన్ కాల్‌కు దాదాపు వారం ముందు ఉక్రెయిన్‌కు సైనిక సాయం నిలిపివేయాలని ట్రంప్ తన అధికారులను ఆదేశించినట్లు అమెరికా మీడియా తెలిపింది.
అయితే ఇప్పటివరకూ ఏ అమెరికా అధ్యక్షుడినీ అభిశంసన ప్రక్రియ ద్వారా తొలగించలేదు. ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో ఇద్దరు దేశాధ్యక్షులను అభిశంసించారు. 1868లో ఆండ్రూ జాన్స్, 1998లో బిల్ క్లింటన్‌ను అభిశంసించారు. కానీ ఆ ఇద్దరూ సేనేట్ విచారణ నుంచి తప్పించుకున్నారు. ఇక 1973లో రిచర్డ్ నిక్సన్ మాత్రం అభిశంసన అభియోగం రాగానే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.