Pakistan train hijack: 214 మంది బందీలను చంపేశాం.. ఎందుకంటే..: బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన
పాకిస్థాన్ మొండితనంతో వ్యవహరించి, ఆ దేశ ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైందని చెప్పాడు.

బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ రైలును హైజాక్ చేసిన వేర్పాటువాద గ్రూప్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) కీలక ప్రకటన చేసింది. రైలును హైజాక్ చేసిన తర్వాత తాము 214 బందీలతో అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లి, వారందరినీ చంపేసినట్లు చెప్పింది.
బీఎల్‌ఏ ప్రతినిధి జీయాండ్ బలూచ్ ఒక ప్రకటనలో ఈ వివరాలు తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది. తాము తమ డిమాండ్లను నెరవేర్చాలని పాకిస్థాన్ ఆర్మీకి 48 గంటల సమయం ఇచ్చామని, పాక్ ఆర్మీ పట్టించుకోకపోవడంతో 214 మంది బందీలను చంపేశామని జీయాండ్ బలూచ్ అన్నాడు.
“యుద్ధ ఖైదీలను విడుదల చేయడానికి పాకిస్థాన్ సైన్యానికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ 48 గంటల అల్టిమేటం ఇచ్చింది. మేము బందీలుగా అదుపులోకి తీసుకున్న ప్రజల ప్రాణాలను కాపాడడానికి పాక్ సైన్యానికి ఇది చివరి అవకాశం. అయినప్పటికీ, పాకిస్థాన్ తన మొండితనాన్ని అహంకారాన్ని ప్రదర్శించింది. దీని పర్యవసానంగా 214 మంది బందీలను చంపేశాం” అని ఆ ప్రకటనలో జీయాండ్ బలూచ్ పేర్కొన్నాడు.
తాము ఎల్లప్పుడూ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే వ్యవహరిస్తామని, పాకిస్థాన్ మాత్రం మొండితనంతో వ్యవహరించి, ఆ దేశ ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైందని చెప్పాడు.
బలూచ్ లిబరేషన్ ఆర్మీ 214 మందికి చంపామని చెబుతుంది కానీ, ఇందుకు సంబంధించిన ఆధారాలను మాత్రం ఇవ్వలేదు. మరోవైపు పాకిస్థాన్ సైన్య ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ.. తమ సైనికులు 33 మంది మిలిటెంట్లను చంపారని, 354 మంది బందీలను రక్షించారని అంటున్నారు.
మిలిటెంట్లతో జరిగిన కాల్పుల్లో 23 మంది సైనికులు, ముగ్గురు రైల్వే ఉద్యోగులు, ఐదుగురు ప్రయాణీకులు సహా మొత్తం 31 మంది మృతి చెందారని చౌదరి అన్నారు. భారత్, అఫ్ఘానిస్థాన్ తిరుగుబాటుదారులకు మద్దతు ఇస్తున్నాయని ఆయన ఆరోపనలు చేశారు. అయితే, ఆయన చేసిన ఆరోపణలను భారత్, అఫ్ఘాన్ ఖండించాయి.