Pakistani Troops Ceasefire Violations: పాకిస్తాన్ బరితెగింపు.. క్షిపణి ప్రయోగంతో కవ్వింపు చర్యలు..

కాల్పుల ద్వారా కవ్వింపు చర్యలపై భారత్ అధికారులు ఇప్పటికే పాక్‌ అధికారులతో హాట్ లైన్‌లో మాట్లాడారు.

Pakistani Troops Ceasefire Violations: పాకిస్తాన్ బరితెగింపు.. క్షిపణి ప్రయోగంతో కవ్వింపు చర్యలు..

Updated On : May 3, 2025 / 7:46 PM IST

Pakistani Troops Ceasefire Violations: పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ పై భారత్ పలు తీవ్ర ఆంక్షలు విధించింది. అయినా పాక్ బుద్ది మారలేదు. పాకిస్తాన్ మరింత బరితెగించింది. భారత్ పై కవ్వింపు చర్యలను ఆపడం లేదు.

తాజాగా పాకిస్తాన్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. అబ్దాలి వెపన్ సిస్టమ్‌గా పిలిచే ఈ క్షిపణిని ఇండస్ కసరత్తుల్లో భాగంగా ప్రయోగించినట్లు పాక్ ప్రకటించింది. ఈ క్షిపణి భూతలం నుంచి భూతలంపై 450 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేధించగలదని పాకిస్తాన్ తెలిపింది. అబ్దాలి వెపన్ సిస్టమ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు ఇస్లామాబాద్ పేర్కొంది.

క్షిపణుల అధునాతన నావిగేషన్ వ్యవస్థ సహా కీలకమైన సాంకేతిక పరిమితులను ధ్రువీకరించడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టినట్లు వెల్లడించింది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్‌, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్ చేపట్టిన ఈ క్షిపణి ప్రయోగం భారత్‌ను రెచ్చగొట్టే చర్యలో భాగంగానే చూస్తున్నారు.

అటు మరోసారి కాల్పులకు తెగబడింది పాక్ ఆర్మీ. వరుసగా 9వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపులకు దిగింది పాక్ ఆర్మీ. నియంత్రణ రేఖ(LOC) వెంబడి భారత్ భూభాగంపై మూడు సరిహద్దు జిల్లాల్లో పలు సెక్టార్లలో భారత సైన్యం పైకి కాల్పులు జరిపింది. ఇండియన్ ఆర్మీ కూడా ధీటుగానే బదులిచ్చింది. సమర్ధవంతంగా పాక్ సైన్యం కాల్పులను తిప్పికొట్టింది.

కాల్పుల ద్వారా కవ్వింపు చర్యలపై భారత్ అధికారులు ఇప్పటికే పాక్‌ అధికారులతో హాట్ లైన్‌లో మాట్లాడారు. అయినా పాక్ మాత్రం తన వైఖరిని వీడటం లేదు. కవ్వింపు చర్యలను కంటిన్యూ చేస్తోంది.

ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఈ ఉగ్రదాడితో యావత్ భారత్ రగిలిపోతోంది. దీని వెనక పాకిస్తాన్ హస్తం ఉందనేందుకు స్పష్టమైన సాక్ష్యాలను భారత్ సంపాదించింది. దీంతో పాక్ పై భారత్ పలు కఠిన ఆంక్షలు విధించింది.

Also Read: శ్రీలంకలో పహల్గాం దాడి ఉగ్రవాదులు..! సమాచారం ఇచ్చిన భారత్‌..

పాక్ సైతం అదే రీతిలో స్పందించి.. భారత్‌పై ఆంక్షలు విధించింది. దాంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఉగ్రదాడి తర్వాత 24వ తేదీ అర్థరాత్రి నుంచి నియంత్రణ రేఖ వద్ద భారత్‌లోని సైనికుల పోస్టులే లక్ష్యంగా చేసుకొని పాక్ ఆర్మీ కాల్పులు జరుపుతోంది.

పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ ప్రమేయం ఉందని ప్రకటించిన భారత్.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేసింది. పాక్​ పౌరులు భారత్​ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. అటు పాకిస్తాన్ కూడా భారత్ పై ఆంక్షలు విధించింది. సిమ్లా ఒప్పందం రద్దు చేసుకుంది. ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది.

Also Read: పాకిస్థాన్‌కు మ‌రో బిగ్ షాకిచ్చిన భారత్.. ఆ దేశం నుంచి దిగుమతులన్నింటిపైనా నిషేధం.. భారత్‌లో వీటి ధరలు పైపైకి..

అంతేకాదు తమ గగనతలంలో భారత్‌కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపేసింది. దీనిపై భారత్‌ కూడా అంతే ధీటుగా స్పందించింది. పాక్‌ విమానయాన సంస్థలకు మన గగనతలాన్ని మూసివేసింది. తాజాగా ఆ దేశం నుంచి దిగుమతులు అన్నింటిపైనా నిషేధం విధించింది భారత్.