చికిత్స కోసం ఆసుపత్రిలో 8 గంటలు వెయిట్ చేసిన వ్యక్తి.. చివరకు నొప్పిని భరించలేకపోతున్నానంటూ మృతి
ప్రశాంత్‌కు భార్య, 3, 10, 14 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Prashant Sreekumar
Canada hospital: ఛాతీలో నొప్పితో ఆసుపత్రికి వెళ్తే అక్కడ చికిత్స చేయకుండా రోగిని వైద్య సిబ్బంది గంటలకొద్దీ వెయిట్ చేయించారు. చివరకు ఆ రోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కెనడా ఎడ్మంటన్‌లోని గ్రే నన్స్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి భారత సంతతి వ్యక్తి బలైపోయాడు.
ప్రశాంత్ శ్రీకుమార్ (44) అనే వ్యక్తి ఛాతీ నొప్పితో బాధపడ్డాడు. నొప్పిని తట్టుకోలేకపోతున్నానని తన తండ్రి కుమార్ శ్రీకుమార్‌కు చెప్పాడు. అదే విషయాన్ని ఆసుపత్రి సిబ్బందికి తెలియజేశాడు.
అయినప్పటికీ, అతడికి వైద్య సిబ్బంది ఓ ట్యాబ్లెట్‌ను మాత్రమే ఇచ్చారు. ఈసీజీ పరీక్ష చేశారు. పెద్ద సమస్య ఏమీ లేదని చెప్పారు. ప్రశాంత్‌ను వెయిటింగ్ రూమ్‌లో కూర్చోవాలని చెప్పారు. కొంతసేపటికి అతడి తండ్రి కుమార్ శ్రీకుమార్ ఆసుపత్రికి చేరుకున్నారు.
Also Read: Video: నిద్రలో పదో అంతస్తు నుంచి పడిపోయిన వ్యక్తి.. కాలు 8వ అంతస్తు గ్రిల్‌లో ఇరుక్కుపోవడంతో..
“నాన్నా, నేను నొప్పిని తట్టుకోలేకపోతున్నాను” అని తన కుమారుడు చెప్పాడని కుమార్ శ్రీకుమార్ తెలిపారు. చాలా సేపటి తర్వాత నర్సులు తన కుమారుడి రక్తపోటును పరిశీలించారని చెప్పారు.
“అది పైపైకి పెరుగుతూనే ఉంది. నాకు అది పూర్తిగా అదుపు తప్పిన స్థాయిలో కనిపించింది” అని కుమార్ గ్లోబల్ న్యూస్‌కు చెప్పారు. 8 గంటల తరువాత చివరకు ప్రశాంత్‌ను ఎమర్జెన్సీ రూమ్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ 10 సెకన్లలోనే అతడు కుప్పకూలి మరణించాడు.
“ఐసీయూలో దాదాపు 10 సెకన్లు కూర్చున్న తరువాత నా కుమారుడు నన్ను చూశాడు. లేచి తన ఛాతీపై చేయి పెట్టాడు. వెంటనే కుప్పకూలిపోయాడు” అని కుమార్ శ్రీకుమార్ చెప్పారు.
ప్రశాంత్‌కు భార్య, 3, 10, 14 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రశాంత్ భార్య మాట్లాడుతూ.. తన భర్త రక్తపోటు 210కి చేరిందని చెప్పింది. అయినా అతడికి నొప్పి జ్వరం తగ్గించే ఒక్క మాత్ర మాత్రమే ఇచ్చారని వెల్లడించింది.
గ్రే నన్స్ ఆసుపత్రి స్పందిస్తూ.. రోగి కుటుంబ సభ్యులు, స్నేహితుల పట్ల సానుభూతి వ్యక్తం చేసింది. గోప్యత కారణంగా రోగి చికిత్స వివరాలను చెప్పలేమని తెలిపింది.
