హమ్మయ్యా..బతికి బైటపడ్డా : కిల్లర్ వేల్స్ నుంచి తప్పించుకుని టూరిస్టుల బోట్లో దూకిన పెంగ్విన్..

penguin jumped into tourists boat : సముద్రం ఎంత గంభీరమైనదో అంత ప్రమాదకరమైనది కూడా. దూరం నుంచి చూస్తే అందంగా కనిపించి కవ్వించే సముద్రం దగ్గరకెళితే భయపెడుతుంది. సముద్రంలో జీవించే జీవులకు పెద్ద వాటినుంచి చిన్నవాటికి ఎటువంటి ప్రాణభయం ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలా వేల్స్ కు పెంగ్విన్లను గుటుక్కుమనిపించటం అంటే ఎంతో ఇష్టం. అలాగే వేల్స్ నుంచి తప్పించుకుని బతకటం కూడా పెంగ్విన్లకు పెద్ద టాస్కే..కొన్ని సమయాల్లో పెంగ్విన్లు వేల్స్ నుంచి తప్పించుకుంటాయి. అలా ఓ కిల్లర్ వేల్ వేట నుంచి ఓ పెంగ్విన్ బతికి బైటపడింది.
వేగంగా ఊదుకుంటూ వచ్చిన కిల్లర్ వేల్ నుంచి అత్యంత చాకచక్యంగా తప్పించుకుని బతికి బైటపడిందో పెంగ్విన్..అనంత జలరాశిలో ఓ భారీ కిల్లర్ వేల్ నుంచి తప్పించుకోవటమంటే మాటలు కాదు అంతకంటే వేగంగా ఈదాలి..తప్పించుకోవాలి. అలా ఓ పెంగ్విన్ కిల్లర్ వేల్ నుంచి ఎలాగైనా సరే తప్పించుకుని ప్రాణాలతో బైటపడాలని ఓ టూరిస్టుల బోటులోకి బాణంలా దూసుకొచ్చి దూకేసింది. ప్రాణభయం ఎవరికైనా ఒకటే కదా..అది మనిషికైనా, జంతువుకైనా. చిరు ప్రాణులకైనా..
అలా వేగంగా దుముకుతూ..ఈదుతూ వస్తున్న పెంగ్విన్ ను చూసిన టూరిస్టులంతా షాక్ అయ్యారు. ఆశ్చర్యంతో వాళ్లలా చూస్తుండిపోతుండగాఅది మాత్రం ఎంచక్కా ఆ బోటులో ఎక్కి నిలుచుంది. ఈ ఘటన అంటార్కిటికాలో జరిగింది. ఈ దృశ్యాన్ని మ్యాట్ కర్స్‌టెన్ అనే ఓ బ్లాగర్ తన కెమెరాలో బంధించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీనిపై స్పందించిన కర్స్‌టెన్.. ఒక్కసారిగా ఆ పెంగ్విన్‌ను చూసేసరికి ఆశ్చర్యం కలిగింది. ఏదో నేషనల్ జాగ్రఫీ చానల్‌ను నేరుగా చూస్తున్నట్లుగా అనిపించింది. అది కిల్లర్ వేల్స్ బారి నుంచి తప్పించుకున్న పెంగ్విన్ బోటులోకొచ్చిన కాసేపటికి స్థిమితపడింది. చాలా ప్రశాంతంగా కనిపించింది అని తెలిపారు. హమ్మయ్యా బతికి బైటపడ్డానంటూ అలా చూస్తుండి పోయిందా పెంగ్విన్..