ఏలియన్స్ ఉన్నాయా? అంతరిక్షంలో ఎక్కడైనా జీవం ఉందా? కుండ బద్దలుకొట్టినట్లు చెప్పేసిన సునితా విలియమ్స్
"నీళ్లు ఉంటే ఏదో ఒక జీవ రూపం ఉండే అవకాశం ఉంది. చంద్రుడిపై, మార్స్‌పై కూడా నీటి ఆనవాళ్లు కనిపించాయి. మార్స్‌పై ఒకప్పుడు జీవం ఉండొచ్చు. అక్కడికి వెళ్లగలిగితే దాని గురించి తెలుసుకోవచ్చు" అని తెలిపారు.
Sunita williams (Image Credit To Original Source)
- స్పేస్‌లో జీవం ఉందని నమ్ముతాను
- కొన్ని విచిత్రమైన వాయువులను గుర్తించాం
- అంతరిక్ష కేంద్రం బయట కూడా సూక్ష్మజీవులు ఉన్నాయి
Sunita Williams: స్పేస్‌లో జీవం ఉందని తాను కచ్చితంగా నమ్ముతానని నాసా వ్యోమగామి సునితా విలియమ్స్ అన్నారు. ఆమె రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రాజ్ శమణి యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
అంతరిక్షంలో ఎక్కడైనా జీవం ఉందా? అన్న ప్రశ్నకు సునితా విలియమ్స్ స్పందిస్తూ.. “ఉందని కచ్చితంగా నమ్ముతాను. అక్కడ లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మనది ఒక్క నక్షత్రం చుట్టూ తిరిగే చిన్న గ్రహం మాత్రమే. కాబట్టి భూమి బయట జీవం ఉంటుంది. భూమిపై కూడా మనం ఊహించని ప్రదేశాల్లో జీవం ఉంది. సముద్రపు అడుగున థర్మల్ వెంట్స్ దగ్గర జీవులు ఉన్నాయి.
అక్కడ వెలుతురు లేకుండా, తీవ్రమైన ఒత్తిడిలో, చీకట్లో జీవులు బతుకుతాయి. అలాగే, మేము రెండో స్పేస్ వాక్ సమయంలో కొన్ని విచిత్రమైన వాయువులను గుర్తించాం. నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ అంతరిక్ష నౌక బయట భాగంలో స్వాబ్ చేశాడు. అంతరిక్ష కేంద్రం బయట కూడా సూక్ష్మజీవులు ఉన్నాయని తెలిసింది.
అవి మనదగ్గరి నుంచే వెళ్లి ఉండొచ్చు. ఎందుకంటే వాయువులు విడుదల చేసే ప్రాంతాల దగ్గరే అవి ఉన్నాయి. అయినా ఇది ఒక విషయాన్ని నిరూపిస్తుంది. అంతరిక్ష శూన్యంలో, వేడి పెరగడం తగ్గడం జరుగుతున్న పరిస్థితుల్లో కూడా జీవం నిలబడుతుంది. ఇది భూమి బయట జీవం ఉండే అవకాశానికి బలమైన ఆధారం. జూపిటర్ చుట్టూ తిరిగే కొన్ని ఉపగ్రహాలపై జీవం ఉండే అవకాశం ఉంటుంది.
అక్కడికి ఒక అంతరిక్ష నౌకను పంపి, మంచు పొర చీల్చి రోవర్ పంపితే ఏమి జరుగుతుందో చూడాలని ఉంది. అలాంటి ప్రణాళికలు కూడా ఉన్నాయి. నీరు ఉంటే ఏదో ఒక జీవ రూపం ఉండే అవకాశం ఉంది. చంద్రుడిపై, మార్స్‌పై కూడా నీటి ఆనవాళ్లు కనిపించాయి. మార్స్‌పై ఒకప్పుడు జీవం ఉండొచ్చు. అక్కడికి వెళ్లగలిగితే దాని గురించి తెలుసుకోవచ్చు” అని చెప్పారు.
Also Read: అంతరిక్షంలో సునితా విలియమ్స్ చూసిన చిత్రవిచిత్రాలు ఇవే.. స్వయంగా చెప్పేసింది..
స్పేస్‌లో ఏదైనా జీవ జాతి ఉందా?
స్పేస్‌లో ఏదైనా జీవ జాతి ఉందని మీరు భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు సునితా విలియమ్స్ సమాధానం చెప్పారు. “ఉండే అవకాశం ఉంది. ఎవరికీ కచ్చితంగా తెలియదు. వెళ్లి చూడాలి. అవకాశం ఉందని నమ్ముతున్నాను. కానీ, మనుషులే ఉంటారని అనుకోవడం లేదు. ఏదో ఒక జీవ రూపం ఉండే అవకాశం ఉంది” అని తెలిపారు.
అరోరా అద్భుతం..
భూ అయస్కాంత క్షేత్రంతో సూర్య కణాలు స్పందించడంతో ఏర్పడే కాంతి తరంగాలు (అరోరా) గురించి సునితా విలియమ్స్ స్పందిస్తూ.. “అరోరా చాలా అందమైనది. వేసవిలో మేము అక్కడ ఉన్నప్పుడు సూర్య కార్యకలాపాల వల్ల అద్భుతమైన ఆరోరాలు కనిపించాయి. సాధారణంగా కిటికీ బయట చూస్తే దూరంగా కనిపిస్తాయి. ఈ సారి మేమే ఆరోరా గుండా ప్రయాణించాం. మా కక్ష్య 51.6 డిగ్రీలు. ఆ స్థాయికి ఆరోరా దిగివచ్చింది” అని తెలిపారు.
పచ్చరంగు కాంతులు మాత్రమే కాదు.. గులాబీ, ఊదా రంగులు కూడా కనిపించాయని సునితా విలియమ్స్ అన్నారు. అది మరింత బలమైన శక్తికి సూచన అని చెప్పారు. భూ అయస్కాంత క్షేత్రంలోని ఇతర మూలకాలతో స్పందన జరుగుతున్నట్టు అర్థమని అన్నారు.
తన తొలి స్పేస్ వాక్ సమయంలోనే మొదటిసారి ఆరోరాను చూశానని తెలిపారు. అది తన కింద కనిపించిందని, విశ్వంలో ఉన్న శక్తి ఎంత అద్భుతమో అప్పుడు అర్థమైందని చెప్పారు. భూమిపై మనం శక్తి గురించి ఎప్పుడూ ఆలోచిస్తాం.. కానీ, స్పేస్‌లో మన ఊహలకు అందని స్థాయిలో శక్తి ఉందని తెలిపారు.
