అంతరిక్షంలో సునితా విలియమ్స్ చూసిన చిత్రవిచిత్రాలు ఇవే.. స్వయంగా చెప్పేసింది..
"మేఘగర్జన నుంచి, మెరుపు నుంచి వెలువడే శక్తిని ఫొటోలుగా తీయగలిగామంటే నిజంగా అద్భుతం. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇవి ఉన్నాయని శాస్త్రవేత్తలకు తెలుసు. కానీ, వాటిని నమోదు చేయడం చాలా కష్టం" అని సునితా విలియమ్స్ అన్నారు.
Sunita williams (Image Credit To Original Source)
- భూమి చుట్టూ చాలా కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఉన్నాయి
- ఈ సారి అవి స్పష్టంగా కనిపించాయి
- అవి కళ్ల ముందే దూసుకెళ్తూ కనిపిస్తాయి
Sunita Williams: నాసా వ్యోమగామి సునితా విలియమ్స్ అంతరిక్షంలో చూసిన అతి విచిత్రమైన విషయం ఏంటి? భూమిపై ఉన్నవాళ్లు నమ్మడం కష్టం అనుకునే విషయం ఏది? ఈ ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు. సునితా విలియమ్స్ రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రాజ్ శమణి యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు.
ఆ ప్రశ్నలకు సునితా విలియమ్స్ స్పందిస్తూ.. “ఆసక్తికరమైన ప్రశ్న. రెండు వేర్వేరు విషయాలు నాకు భిన్నంగా అనిపించాయి. ఇప్పుడు భూమి చుట్టూ చాలా కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ సారి అవి స్పష్టంగా కనిపించాయి. 10 ఏళ్ల క్రితం ఇవి ఇలా కనిపించేవి కాదు.
నక్షత్రాలలా వస్తున్నట్టు కనిపిస్తూనే, అవి కళ్ల ముందే దూసుకెళ్తూ కనిపిస్తాయి. అప్పుడు ఒక్కసారిగా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అన్న భావన కలుగుతుంది. ఇది మంచిదే.. ఎందుకంటే ఈ ఉపగ్రహ సమూహాల వల్ల భూమిపై కమ్యూనికేషన్ బాగా పెరిగింది. కానీ, అదే సమయంలో భూమి చుట్టూ కక్ష్యల్లో చాలా వస్తువులు తిరుగుతున్నాయన్న భావన బలంగా కలిగింది.
మా వద్ద చాలా శక్తిమంతమైన కెమెరాలు ఉన్నాయి. వాటితో మేము ఫొటోలు తీయగలిగాం. మేఘాలు ఉరిమే సమయంలో మేఘాల నుంచి పైవైపు, ఆకాశం దిశగా నీలి రంగులో వెలువడే అరుదైన విద్యుత్ కాంతి ప్రవాహాలు, ఎరుపు స్ప్రైట్స్‌ను చిత్రీకరించాం. శక్తి పైకి వస్తున్నట్టు కనిపిస్తుంది.
మేము వెళ్లిన తర్వాత కూడా నాసా వ్యోమగామి నికోల్ ఐయర్స్ కొన్ని ఫొటోలు తీసింది. అవి బయట ప్రచురితమయ్యాయి. మేఘగర్జన నుంచి, మెరుపు నుంచి వెలువడే శక్తిని ఫొటోలుగా తీయగలిగామంటే నిజంగా అద్భుతం. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇవి ఉన్నాయని శాస్త్రవేత్తలకు తెలుసు. కానీ, వాటిని నమోదు చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఉన్న కెమెరాల వల్ల వాటిని డాక్యుమెంట్ చేయగలుగుతున్నాం. ఇవన్నీ నిజంగా అద్భుతమైన విషయాలే.
నాసా వ్యోమగామి, ఫొటోగ్రాఫర్ డాన్ పెటిట్ అంతరిక్ష కేంద్రం నుంచి భూమి, అంతరిక్ష దృశ్యాలను అత్యంత నాణ్యతతో చిత్రీకరించారు. మిల్కీ వే స్పష్టంగా కనిపిస్తుంది. లక్షల కోట్ల నక్షత్రాలు ఒకేసారి కనిపించడం అద్భుతంగా ఉంటుంది. కానీ మేము చాలా వేగంగా ప్రయాణిస్తున్నాం కాబట్టి నక్షత్రాల స్పష్టమైన ఫొటోలు తీయడం చాలా కష్టం.
డాన్ పెటిల్ చిన్న గియర్ బాక్స్ ఏర్పాటు చేసి, మేము ప్రయాణిస్తున్న కక్ష్య వేగాన్ని అనుకరించేలా చేశాడు. అలా చేసి నక్షత్రాలను స్పష్టంగా ఫొటోలలో పట్టగలిగాడు. భూమిపై లైట్లు మాత్రం కొద్దిగా మసకగా కనిపించాయి. సాధారణ కెమెరా సెటప్‌కు పూర్తి విరుద్ధంగా తీశాడు. ఆ ఫొటోలు కూడా డాన్ పెటిట్ తీసినవే. ఎవరైనా సమయం దొరికితే ఇంటర్నెట్‌లో చూసుకోవచ్చు. అవి నిజంగా అద్భుతమైన చిత్రాలు. అటువంటి ప్రతిభావంతమైన ఫొటోగ్రాఫర్లతో కలిసి అక్కడ ఉండే అవకాశం నాకు దక్కింది” అని అన్నారు.
