ఆస్ట్రేలియాలో ప్రకాశం జిల్లా వాసి అనుమానాస్పద మృతి, అసలేం జరిగింది

ఆస్ట్రేలియాలో ప్రకాశం జిల్లా వాసి అనుమానాస్పద మృతి, అసలేం జరిగింది

Updated On : February 27, 2021 / 4:32 PM IST

prakasam district native dies in australia: ఆస్ట్రేలియాలో ప్రకాశం జిల్లాకు చెందిన హరీశ్‌బాబు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన హరీశ్‌ ఆరేళ్లుగా అడిలైట్ రాష్ట్రంలో సలిస్‌బరిలో ఉంటున్నాడు. ప్రసవం కారణంగా అతడి భార్య పుట్టింటికి వచ్చింది. కరోనా నేపథ్యంలో తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లలేకపోయింది. ప్రస్తుతం నిబంధనలు సడలించడంతో బిడ్డతో పాటు హరీశ్‌ భార్య నిన్న ఆస్ట్రేలియాకు బయలుదేరింది.

ఈ క్రమంలో చెన్నై చేరుకున్న తర్వాత ఆమె హరీశ్ కి ఫోన్ చేసింది. అయితే హరీశ్ ఫోన్ ఎత్తలేదు. ఇలా ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా హరీశ్‌ స్పందించలేదు. దీంతో కంగారు పడిన ఆమె ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న తన బంధువులకు ఫోన్ చేసింది. వాళ్లు ఆమెకు షాకింగ్ న్యూస్ చెప్పారు. హరీశ్ చనిపోయాడని తెలిపారు. దీంతో ఆమె దిగ్భ్రాంతికి లోనైంది.

కాగా, ఆస్ట్రేలియాలో హరీశ్ ఒంటరిగానే ఉంటున్నాడు. అతడు ఎలా మరణించాడో తెలియడం లేదు. హరీశ్ మృతి వార్తతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.