Protests in US : అట్టుడుకుతున్న అమెరికా.. ట్రంప్‌నకు వ్యతిరేకంగా రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతున్న ప్రజలు.. ఎందుకంటే?

Protests in US : ‘నో కింగ్స్’ పేరుతో అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 2,500 కంటే ఎక్కువ ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.

Protests in US : అట్టుడుకుతున్న అమెరికా.. ట్రంప్‌నకు వ్యతిరేకంగా రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతున్న ప్రజలు.. ఎందుకంటే?

protests in US

Updated On : October 19, 2025 / 10:15 AM IST

Protests in US : నిరసనలతో అమెరికా అట్టుడుకుతోంది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘నో కింగ్స్’ పేరుతో న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, షికాగో, లాస్ ఏంజెలెస్ సహా మొత్తం 50 నగరాల్లో నిరసనకారుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత నియంతలా వ్యవహరిస్తున్నాడన్న వాదన ఉంది. ఇష్టానుసారంగా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బందులు పాలుచేస్తున్నాడని అమెరికాలోని మెజార్టీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వలస విధానం, భద్రత విషయం, ప్రభుత్వ ఉద్యోగాల్లో కోత, షట్‌డౌన్, విద్యపై ట్రంప్ పరిపాలన విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలియజేస్తున్నారు. దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు.

నివేదిక ప్రకారం.. ‘నో కింగ్స్’ (No Kings protests) పేరుతో అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 2,500 కంటే ఎక్కువ ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. బారోగ్‌లలో శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకు లక్ష మందికి పైగా ప్రజలు గుమిగూడారని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఈ క్రమంలో ఎలాంటి అరెస్టులు జరగలేదని తెలిపింది. నిరసనల సందర్భంగా ఆందోళనకారులు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనా విధానాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ ఆందోళనకారులు నినాదాలు చేస్తున్నారు. ఈ నిరసనలకు డెమోక్రాట్లతోపాటు పలు సంఘాలు, ప్రముఖ వ్యక్తులు మద్దతు పలికారు. కానీ, ఆందోళనకారులు ప్రశాంతంగా ఉండి తమ ప్రదర్శనను శాంతియుతంగా నిర్వహించాలని కోరారు. ఈ నిరసన ప్రదర్శనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఉత్తర వర్జీనియాలో, వాషింగ్టన్ డీసీకి వెళ్లే దారిలో ఓవర్ పాస్ లపై నిరసనకారులు కవాతు చేస్తూ కనపించారు. భారీ సంక్యలో ప్రజలు నిరసనల్లో పాల్గొన్నారు. మరోవైపు.. అమెరికా వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను వైట్‌హౌస్‌తోపాటు రిపబ్లికన్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇవి ‘హేట్ అమెరికా’ నిరసనలుగా పేర్కొంది.
ఈ ఆందోళనలపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఫాక్స్ బిజినెస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వారంతా నన్ను రాజు అని అంటున్నారు. కానీ, వారు చెబుతున్నట్లుగా తాను రాజును కాదు అంటూ ట్రంప్ అన్నారు.

మరోవైపు తాజా నిరసనల నేపథ్యంలో ఆయా రాష్ట్ర గవర్నర్లు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యగా జాతీయ బలగాలను రంగంలోకి దించారు.