వాళ్ల జోలికి వెళ్లొద్దు.. భారత్‌పై ట్రంప్ సుంకాల పెంపు వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నిక్కీ హెలీ..

భారత్ పై డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హెలీ తీవ్రంగా తప్పుబట్టారు.

వాళ్ల జోలికి వెళ్లొద్దు.. భారత్‌పై ట్రంప్ సుంకాల పెంపు వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నిక్కీ హెలీ..

Nikki Haley Donald Trump

Updated On : August 6, 2025 / 8:34 AM IST

Nikki Haley warning to Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిరోజులుగా భారత్ పై తన అక్కస్సును వెళ్లగక్కుతున్నాడు. రష్యా నుంచి భారత్ పెద్దమొత్తంలో చమురు కొనుగోలు చేస్తోందని, తద్వారా యుక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తోందని అర్ధంపర్దం లేని వాదనలతో ట్రంప్ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నాడు. దీంతో ఇటీవల భారత్ దిగుమతులపై 25శాతం సుంకాలు పెంచిన ట్రంప్.. మరోసారి బెదిరింపులకు దిగాడు.

ట్రంప్ తాజాగా మాట్లాడుతూ.. వాణిజ్యం విషయంలో భారత్ మంచి భాగస్వామి కాదు.. ఆ దేశం మాతో పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తోంది. కానీ, మేం మాత్రం ఆ స్థాయిలో చేయడం లేదు. కాబట్టి 25శాతం సుంకాలు విధించాం.. రానున్న 24 గంటల్లో దీన్ని గణనీయంగా పెంచబోతున్నాం అంటూ హెచ్చరించారు. ఎందుకంటే.. రష్యా నుంచి భారీ స్థాయిలో చమురును కొనుగోలు చేస్తుందని, తద్వారా యుక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.

భారత్ పై డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హెలీ తీవ్రంగా తప్పుబట్టారు. భారత్ జోలికి వెళ్లొద్దు అంటూ చిన్నపాటి హెచ్చరికలు చేశారు. భారత్ లాంటి బలమైన మిత్ర దేశంతో అమెరికా తన సంబంధాలను దెబ్బతీసుకోకూడదని ఆమె సూచించారు. ‘రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకూడదు.. కానీ, చైనా చేయొచ్చా అని ఆమె ఎక్స్ వేదికగా ట్రంప్‌ను ప్రశ్నించారు. రష్యా, ఇరానియన్ నుంచి చైనా అత్యధికంగా ఇంధనం కొనుగోలు చేస్తుందని, అలాంటి దేశానికి మాత్రం సుంకాల నుంచి 90రోజులు మినహాయింపు ఇచ్చారంటూ ట్రంప్ పరిపాలనపై ఆమె పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

భారత దేశం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయాలని, లేకుంటే అమెరికాకు దిగుమతులపై భారీ ఎత్తున సుంకాలు పెంచుతామని కొన్నిరోజులుగా డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నాడు. ఇప్పటికే ట్రంప్ బెదిరింపులకు భారత ప్రభుత్వం గట్టి కౌంటర్ ఇచ్చింది. అణు పరిశ్రమ, విద్యుత్ వాహనాలు, ఎరువుల తయారీకి అవసరమైన పదార్థాలను రష్యా నుంచి అగ్రరాజ్యం దిగుమతి చేసుకోవడాన్ని భారత్ ప్రశ్నించింది. మరోవైపు.. అమెరికా వైఖరిపై రష్యాసైతం మండిపడింది. భారత్ పై వాణిజ్యపరంగా ఒత్తిడిని పెంచబోతుందని విమర్శించింది. సార్వభౌమ దేశాలకు తమ వాణిజ్య భాగస్వాములను సొంతంగా ఎంచుకునే హక్కు ఉంటుందని రష్యా స్పష్టం చేసింది.