లద్దాఖ్‌ బోర్డర్‌లో డ్రాగన్‌ కుట్రలు.. ఆ బంకర్లను ఎందుకు నిర్మిస్తోంది.. కవ్వించే ప్రయత్నంలో భాగమా?

చైనా పాంగాంగ్‌ లేక్‌ దగ్గర ఆ బంకర్లను ఎందుకు నిర్మించింది? ఇది భారత్‌కు మరో సవాల్‌ విసిరి కవ్వించే ప్రయత్నంలో భాగమేనా?

లద్దాఖ్‌ బోర్డర్‌లో డ్రాగన్‌ కుట్రలు.. ఆ బంకర్లను ఎందుకు నిర్మిస్తోంది.. కవ్వించే ప్రయత్నంలో భాగమా?

satellite images reveal China ramps up construction of bunkers near LAC

China Bunkers: డర్టీ డ్రాగన్‌ బుద్ధి మారడం లేదు.. భారత దేశ సరిహద్దుల వెంట.. దేశాన్ని అస్థిరపరిచే కుట్రలను ఆపడం లేదు. తాజాగా చైనా మరో భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ PLA తూర్పు లద్దాఖ్‌లోని ప్యాన్‌ గాంగ్‌ సరస్సు చుట్టుపక్కల అండర్‌ గ్రౌండ్‌లో బంకర్ల నిర్మాణానికి సంబంధించి శాటిలైట్‌ చిత్రాలు యటకు వచ్చాయి. దీంతో భారత్‌ ఆలోచనలో పడింది. చైనా పాంగాంగ్‌ లేక్‌ దగ్గర ఆ బంకర్లను ఎందుకు నిర్మించింది? ఇది భారత్‌కు మరో సవాల్‌ విసిరి కవ్వించే ప్రయత్నంలో భాగమేనా?

పుట్టుకతో వచ్చిన బుద్ధి చావుతో కానీ పోదంటారు.. చైనా బుద్ధి కూడా అలాంటిదే. పక్కదేశాలతో ఏరికోరి గిల్లికజ్జాలు పెట్టుకోవడం.. తన పెత్తనం చూపించే ప్రయత్నం చేయడం.. భయపడే దేశాలను తన గుప్పిట్లో పెట్టుకుని రాజకీయంగా, ఆర్థికంగా లాభపడాలని చూడటం.. ఇది ఇప్పటిది కాదు.. దశాబ్దాలుగా చైనా చేస్తున్న కుట్రలివే. కాకపోతే భారత్‌తో ఆ పప్పులుడకడం లేదు.. అందుకే కయ్యానికి కవ్విస్తూ కుయుక్తుల్ని పన్నుతుంటుంది చైనా. బోర్డర్‌లో అలాంటి విషపన్నాగమే ఒకటి ఇప్పుడు బయటపడింది.

ఆర్మీని బలపరుచుకోవడం వెనక కారణాలేంటి..?
జమ్మూ కశ్మీర్‌లో తూర్పు లద్దాఖ్‌లో చైనా ఆర్మీ అవసరాలకోసం బంకర్లు నిర్మిస్తోంది. అందులో భారీగా ఆయుధాలు, ఇంధనం, సైనిక వాహనాలను ఒక్కొక్కటే జమచేస్తోంది. పాంగాంగ్ సరస్సుకు ఉత్తరం వైపు పర్వతాల మధ్య చైనా ఆర్మీ బేస్‌ క్యాంప్‌ సిర్జాప్‌ ఉంది. ఇక్కడే పెద్ద బంకర్ల నిర్మాణం చేపట్టింది. ఇది లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌కు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. నాలుగేళ్లకు ముందు ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు. కానీ ఇప్పుడక్కడ ఆర్మీ యుద్ధ ట్యాంకులు, ఇంధనం, సైనిక అవసరాలకు వాడే వాహనాలు తిరుగుతున్నాయి. ఇవన్నీ 2021-22 మధ్య నిర్మించిన బంకర్లేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. వీటిని ఆయుధాలు, ఇంధనం, ఇతర ఆర్మీ సామాగ్రిని భద్రపరిచేందుకేనని కూడా అంటున్నారు. మరి ఇక్కడ రహస్య సైనిక స్థావరాలను ఏర్పరుచుకోవడం వెనక ఉద్దేశ్యం ఏంటి? ఆర్మీని బలపరుచుకోవడం వెనక కారణాలేంటి..?

బంకర్ల బండారం బట్టబయలు
యూఎస్‌కు చెందిన బ్లాక్‌ స్కై అనే సంస్థ చైనా బంకర్లను బయటపెట్టింది. మే 30న ఉపగ్రహాల సాయంతో కొన్నిఫోటోలను తీశారు. అందులో ఈ బంకర్ల బండారం బయటపడింది. ఒకటి పెద్ద బంకర్‌. దానికి ఏకంగా ఎనిమిది ఎంట్రన్స్‌లు ఉన్నాయి. మరోటి చిన్న బంకర్‌.. దానికి ఐదు ఎంట్రన్స్‌లు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకా పూర్తిస్థాయిలో బంకర్ల నిర్మాణం పూర్తి కాలేదు. వీటికోసం చాలా హైటెక్నాలజీతో లోతుగా తవ్వకాలు చేస్తోంది చైనా సైన్యం. కొన్ని ఆయుధాలు నిల్వ చేయడం కోసం, మరికొన్ని ఇంధనం నిల్వచేయడానికి.. ఇంకొన్ని సాయుధ వాహనాలను సేఫ్‌గా ఉంచేందుకు ఏర్పాటు చేసుకున్న షెల్టర్స్‌.

Also Read : దోస్త్ మేరా దోస్త్.. భారత్‌తో రష్యాకు ఉన్న బంధం ఏంటి? మనకు వాళ్లు అందిస్తున్న సహకారం ఎంత?

పాంగాంగ్ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లో మోహరించిన డ్రాగన్‌ సైన్యానికి ఇదే ప్రధాన కార్యాలయంగా మారింది. అది భారత భూభాగమని ఇండియా వాదిస్తోంది. 2020లో లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వెంట ఇరుదేశాల సైన్యం ఘర్షణకు దిగింది. 20 మందికి పైగా భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దానికి ముందు ఇక్కడ ఎలాంటి ఆవాసాలు లేవు. ఆ తర్వాత 2021-22 మధ్యలో సిర్జాప్‌ దగ్గర చైనా ఆర్మీ ఒక స్థావరం నిర్మించింది. ఇప్పుడు అక్కడే బంకర్ల నిర్మాణం చేపట్టింది. వీటి బయట భారీ భవనాలు కూడా ఉన్నాయి.

ఇండియా అలర్ట్
చైనా బంకర్ల వ్యవహారంపై భారత రక్షణరంగంలో కూడా చర్చ జరుగుతోంది. అక్కడ పరిస్థితుల్ని ఆర్మీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. ఎల్‌ఓసీ వెంబడి ఉన్న సైన్యాన్ని అప్రమత్తం చేస్తోంది. చైనా కవ్వింపు చర్యలకు దిగేందుకు, అవసరమైనప్పుడు దాడులు చేసేందుకే సిర్జాప్‌ సైనిక స్థావరాన్ని పటిష్టం చేసుకుంటోందన్న వాదనలు ఉన్నాయి. ఇది రక్షణ పరంగా భారత్‌కు ఆందోళన కలిగించేదే.

Also Read : ప్రధాని మోదీ రష్యా పర్యటన.. శత్రు దేశాలకు చెక్‌ పెట్టేలా త్రిశూల వ్యూహం..!

భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలో సుస్థిర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కేంద్రంలోని మోదీ సర్కార్‌ తీసుకునే నిర్ణయాలు చైనాకు కంటగింపుగా మారుతున్నాయి. ఆర్థికంగా, రాజకీయంగా, సైనికపరంగా ఇండియా బలపడటం డ్రాగన్‌కు అస్సలు నచ్చదు. తమను మించిపోతున్నారనే ఇన్‌ఫియారిటీ ఎప్పుడూ ఆ దేశాన్ని వేధించే అంశం. అందుకే ఎలాగైనా భారత్‌ను అస్థిర పరిచేందుకు పక్కదారులు వెతకడం, ఏవీ దొరక్కపోతే కవ్వింపు చర్యలకు దిగడం డ్రాగన్‌కు అలవాటుగా మారింది. సమయం చిక్కినప్పుడల్లా విషాగ్నిని కక్కుతూ తన కుట్రలను బయటపెడుతుంటుంది. ఇప్పుడు అలాంటి కుతంత్రంలో భాగంగానే ఈ బంకర్ల నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది.