Oxygen Galaxy : అత్యద్భుతం.. అదిగో.. ఆ గెలాక్సీలో ఆక్సిజన్.. విశ్వం గుట్టువిప్పిన సైంటిస్టులు.. భూమిపైలా జీవం సాధ్యమేనా?
Oxygen Galaxy : మన భూమిపై మాదిరిగానే 1.340 కోట్ల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక గెలాక్సీలో ఆక్సిజన్ ఆనవాళ్లు ఉన్నాయని ఖగోళ సైంటిస్టులు కనిపెట్టారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా గుర్తించారు.

Oxygen Galaxy
Oxygen Galaxy : అనంత విశ్వంలో మనలాంటి గెలాక్సీలు ఎన్నో ఉద్భవించాయి. ఎన్నో నక్షత్రాల సముదాయాన్నే గెలాక్సీగా చెబుతారు. అలాంటి గెలాక్సీలో ఆక్సిజన్ కూడా ఉందని సైంటిస్టులు తేల్చేశారు. వాస్తవానికి, మన భూమిపై మాత్రమే ఆక్సిజన్ ఉందని నమ్మేవాళ్లం.
ఇప్పుడు మన గెలాక్సీపైనే మాత్రమే కాదు.. అల్లంత దూరాన ఉన్న ఒక గెలాక్సీలో కూడా ఆక్సిజన్ ఆనవాళ్లు ఉన్నాయని సైంటిస్టులు కనుగొన్నారు. ఈ గెలాక్సీ భూమి నుంచి 13.4 బిలియన్ (1.340 కోట్ల) కాంతి సంవత్సరాల దూరంలో ఉందట. ఈ గెలాక్సీ (JADES-GS-z14-0)లో ఆక్సిజన్, ఇతర భారీ మూలకాలను ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్(JWST)తో ఈ గెలాక్సీలో ఆక్సిజన్ ఉందని గుర్తించారు.
300 మిలియన్ ఏళ్ల క్రితం నాటి గెలాక్సీ :
గెలాక్సీలు గతంలో నమ్మిన దానికంటే చాలా వేగంగా ఏర్పడ్డాయని అంటున్నారు. చిలీ ఎడారిలో రేడియో టెలిస్కోప్‌ల భారీ నెట్‌వర్క్ అయిన అటకామా లార్జ్ మిల్లీమీటర్/సబ్‌మిల్లీమీటర్ అర్రే (ALMA)తో సహా అధునాతన అంతరిక్ష టెలిస్కోప్‌లను ఉపయోగించి రెండు పరిశోధనా బృందాలు ఈ ఆవిష్కరణను స్వతంత్రంగా నిర్వహించాయి. ఈ గెలాక్సీని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. విశ్వం కేవలం 300 మిలియన్ సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఈ గెలాక్సీ ఉనికిలో ఉందని చెబుతున్నారు.
ఈ గెలాక్సీని చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. లైడెన్ అబ్జర్వేటరీలో ఖగోళ శాస్త్రవేత్త సాండర్ స్కౌస్ ఈ ఆవిష్కరణను ‘‘నవజాత శిశువు’’ అభివర్ణించారు. “ఈ గెలాక్సీ చాలా వేగంగా పరిణామం చెందుతోంది. విశ్వంలో గెలాక్సీల నిర్మాణం మనం అనుకున్నదానికంటే చాలా వేగంగా జరుగుతుంది” అని ఆయన చెప్పారు. ఇటాలియన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త స్టెఫానో కార్నియాని ఈ ఆవిష్కరణను “అద్భుతం” అని అభివర్ణించారు.
ఆక్సిజన్ ఎంత పరిమాణంలో ఉంది? :
ఇది గెలాక్సీలు ఎప్పుడు, ఎలా పుట్టాయనే ప్రశ్నను లేవనెత్తుతుందని అన్నారు. వాస్తవానికి, ఈ గెలాక్సీని 2024లోనే కనుగొన్నారు. కానీ, ఇప్పుడు ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ గెలాక్సీని వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే, గెలాక్సీపై ఆక్సిజన్ ఏయే రూపాల్లో ఉంది? ఎంత పరిమాణంలో ఉందనేది తెలుసుకునే పనిలో పడ్డారు సైంటిస్టులు.
ఇటీవలి పరిశోధనలో డచ్, ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్తల బృందాలు (ALMA) రేడియో టెలిస్కోప్‌ని ఉపయోగించి (JADES-GS-z14-0)ని అధ్యయనం చేశాయి. మన భూమికి దగ్గరలో ఇప్పటివరకూ 700 గెలాక్సీలను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా గుర్తించారు.
యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ (ESO) ప్రకారం.. ఇందులో ఆక్సిజన్ ఉనికి సంకేతాలను కనుగొన్నారు. “కాస్మిక్ డాన్” అని పిలిచే ఈ విశ్వ యుగంలో కొత్త గెలాక్సీలు ప్రధానంగా హైడ్రోజన్, హీలియం వంటి కాంతి మూలకాలను కలిగి ఉండాలి.
కానీ, ఈ గెలాక్సీలో ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ భారీ మూలకాలను కలిగి ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. ఆక్సిజన్ ఉన్నప్పటికీ అక్కడ జీవం కూడా ఉంటుందా? అనే ప్రశ్న లేవనెత్తుతోంది. ఒకవేళ ప్రాణవాయువు ఉంటే జీవం కూడా ఉద్భవించే అవకాశాలు లేకపోలేదు.