Pakistan politics : పాక్ ప్రధాని పదవికి షాబాజ్ నామినేషన్.. నేడు ఎన్నిక.. గెలుపు లాంఛనమే.. ఆసక్తికర ట్వీట్ చేసిన ఇమ్రాన్

పాకిస్థాన్‌లో నూతన ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వ్యతిరేక కూటమిలోని ప్రతిపక్షాలన్నీ పాకిస్థాన్ ప్రధానిగా పీఎంఎల్(ఎన్) అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్‌ను ..

Pakistan politics : పాక్ ప్రధాని పదవికి షాబాజ్ నామినేషన్.. నేడు ఎన్నిక.. గెలుపు లాంఛనమే.. ఆసక్తికర ట్వీట్ చేసిన ఇమ్రాన్

Shahbaz Sharif

Updated On : April 11, 2022 / 8:12 AM IST

Pakistan politics : పాకిస్థాన్‌లో నూతన ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వ్యతిరేక కూటమిలోని ప్రతిపక్షాలన్నీ పాకిస్థాన్ ప్రధానిగా పీఎంఎల్(ఎన్) అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్‌ను ప్రతిపాదించిన విషయం విధితమే. దీంతో ఆదివారం షాబాజ్ షరీఫ్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నిక ఏకగ్రీవం అనుకున్న సమయంలో ఇమ్రాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ పార్టీ సైతం ప్రధాని పదవికి తమ అభ్యర్థిగా విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి షా మహమ్మద్ ఖురేషి పేరును ప్రకటించింది. దీంతో ఏకగ్రీవానికి అవకాశం లేకుండా పోయింది. నూతన ప్రధాని ఎన్నిక కోసం పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ సోమవారం మధ్యాహ్నం 2గంటలకు ప్రత్యేక సమావేశం కానుంది. ఈ సమావేశంలో నూతన ప్రధానిగా షాబాజ్ షరీఫ్ ఎన్నిక లాంఛనం కానుంది.

Pak politics : ఇమ్రాన్ ఖాన్ ఔట్.. అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన విపక్షాలు.. అర్థరాత్రి వరకు కొనసాగిన రాజకీయ హైడ్రామా

ఇదిలాఉంటే షాబాజ్ షరీఫ్ నేతృత్వంలో నూతనంగా కొలువుదీరబోయే పాక్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా బిలావల్ భుట్టో నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు పాక్ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. 33ఏళ్ల వయస్సు కలిగిన బిలావల్ భుట్టో ఆక్స్‌ఫర్డ్‌లో విద్యనభ్యసించారు. బిలావల్ భుట్టో మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో, పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కుమారుడు. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, ప్రధాన మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టోకి మనువడు. రాజకీయ నేపథ్యం, ఉన్నత విద్యనభ్యసించి ఉండటంతో విదేశాంగ మంత్రిగా బిలావల్ భుట్టో ఖాయమని పాక్ మీడియా వర్గాల్లో వార్తా కథనాలు ప్రసారమవుతున్నాయి.

Pakistan : ఇమ్రాన్ ఖాన్ భావోద్వేగ ప్రసంగం.. భారత్‌‌ను ఏ సూపర్ పవర్ శాసించలేదు

మరోవైపు జాతీయ అసెంబ్లీ పరిణామాల నేపథ్యంలో శనివారం నుంచే పాక్ విమానాశ్రయాల్లో నిఘా పెంచారు. ప్రధాన దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఏ ఇమ్మిగ్రేషన్ సిబ్బంది పలు చోట్ల మోహరించారు. ప్రభుత్వంలోని సీనియర్ అధికారులెవరూ నిరభ్యంతర పత్రం లేకుండా దేశం విడిపోరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఇమ్రాన్ ఖాన్ మూడో భార్య బుష్రా బీబీ స్నేహితురాలైన ఫరాఖాన్ వారం రోజుల కిందటే దుబాయ్ వెళ్లాపోయారు. అధికారుల బదిలీల్లో రూ. 243 కోట్లు వసూలు చేశారని ఈమెపై ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఇమ్రాన్, ఆయన మంత్రి వర్గంలోని సహచరులు దేశం విడిచిపోకుండా చూడాలని ఇస్లామాబాద్ హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది. సోమవారం దీనిపై విచారణ జరగనుంది.

పాక్ ప్రధానిగా షాబాజ్ ను అంగీకరించేది లేదని ఇమ్రాన్ తేల్చి చెప్పారు. కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటానికి తెర తీస్తామన్నారు. దేశం కోసం మరో స్వాతంత్ర్య పోరాటం నేటి నుంచి మొదలవుతుందంటూ ట్వీట్ చేశారు. కొత్తగా కొలువు దీరేది విదేశీ ప్రభుత్వమే అంటూ.. ఈ పరిణామాన్ని వ్యతిరేకిస్తూ వీధుల్లోకొచ్చి నిరసన తెలపండి అని పీఐటీ కార్యకర్తలకు, ప్రజలకు ఇమ్రాన్ పిలుపునిచ్చారు. ఇమ్రాన్ పిలుపుతో ప్రజలు రోడ్లపైకొచ్చి నిరసన తెలపడంతో ‘మోసగాళ్ల నేతృత్వంలోని దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని తిరస్కరిస్తూ, మన దేశ చరిత్రలో ఇంత ఆకస్మికంగా, ఇంత పెద్దసంఖ్యలో జనాలు ఎప్పుడూ బయటకు రాలేదంటూ ఇమ్రాన్ ట్వీట్ చేశారు.